కేసీఆర్‌ను ఎదుర్కొనే ఒకేఒక్క పార్టీ బీజేపీ

తెలంగాణలో  కేసీఆర్‌ను ఎదుర్కొనే ఒకేఒక్క పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల శివారు ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు వద్ద గల ఓ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. 

టిఆర్‌ఎస్‌ నుంచి గతంలో గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారని, ఆయన హయాంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆమె ధ్వజమెత్తారు. దుబ్బాక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆమె పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికుల విషయంలో మోసపూరిత మాటలతో కాలం గడుపుతున్నారని అరుణ దుయ్యబట్టారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత వారికే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. కుల, మత భేదం లేకుండా అందరికీ ఒకే విధానం ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

బంగారు తెలంగాణ పేరుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారమైందని అరుణ దయ్యబట్టారు. ‘గోడకు తుప్పుపట్టిన తుపాకీలాంటి వాడివని నువ్వు తుపాకి రాముడివని’ అంటూ ఆమె కేసీఆర్‌ను దుయ్యబట్టారు. కొడుకును సీఎం చేయడానికి మంత్రులతో చెప్పించాడని, కానీ ఇంటెలిజెన్స్‌ వారి నివేదికల్లో వ్యతిరేకత ఉందని తెలుసుకుని మాటమార్చారని ఆమె ఎద్దేవా చేశారు.

నాగార్జునసాగర్‌ పర్యటనలో ప్రజలను కుక్కలతో పోల్చి అవమానపరిచారని అరుణ మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీకి కనీసం భూమిని కేటాయించలేదని, మామునూరు ఎయిర్‌పోర్టు కోసం స్థల సేకరణ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అరుణ విమర్శించారు. ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంత యూనివర్సిటీకి మాత్రం అనుమతులు తెచ్చుకున్నాడని, నిరుద్యోగులకు చేసిందేమీలేదని ఆమె ఎద్దేవా చేశారు.