రైతులతో అనధికారిక చర్చలుండవ్‌ 

రైతులతో అనధికారిక చర్చలుండవ్‌ 

రైతులతో కేంద్రం అనధికారికంగా మాట్లాడటం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి దాపరికాలు, లోపాయికారి అంశాలకు తావులేదని, అంతా బహిరంగం అవుతుందని తేల్చిచెప్పారు. ఇది చర్చలకు సంబంధించిన విషయమని గుర్తు చేశారు. 

మరో వైపు బారికేడ్లు, ఇంటర్నెట్ నిలిపివేత వంటి అంశాలు కేవలం స్థానిక అధికార యంత్రాంగ పరిధిలోని అంశాలని, వీటితో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది శాంతిభద్రతల విషయం అని, నిరసనస్థలివద్ద ఇటువంటివి సాధారణం అన్నారు. చర్చలు అధికారికంగా సాగుతాయని, ఈ విషయంలో అనుమానాలకు తావులేదని తెలిపారు.

జనవరి 22 న ప్రభుత్వం, 41 రైతు సంఘాల మధ్య జరిగిన 11 వ రౌండ్ సమావేశాలు అసంపూర్తిగా ముగిశాయి. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను 18 నెలలపాటు నిలిపివేసేందుకు సిద్ధమన్న తమ ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాలను కోరింది.

రైతు నాయకులతో ప్రభుత్వం తదుపరి రౌండ్ చర్చలు నిర్వహించేందుకు సిద్ధమని మంత్రి తోమర్‌ చెప్పారు. అధికారిక చర్చలు ఎప్పుడు నిర్వహించనున్నామో మీడియాకు తప్పక తెలియజేస్తామని తోమర్ పేర్కొన్నారు.

మరోవంక, పోలీసులు, అధికారులు అదుపులోకి తీసుకున్న రైతులను విడుదల చేసేంత వరకు ప్రభుత్వంతో చర్చించేది లేదని రైతు నాయకులు స్పష్టం చేయగా.. రైతు నాయకులు ఢిల్లీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడటం వల్ల ఫలితం ఉంటుందని సూచించారు. శాంతిభద్రతల సమస్యపై తానేమి మాట్లాడగలనని అడిగారు.