నిరసన తెలుపుతున్న రైతులపై 39 కేసులు 

నిరసన తెలుపుతున్న రైతులపై 39 కేసులు 
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై 39 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ అరెస్టులు జరిగినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి వెల్లడించారు. 
 
ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులపై ఎన్ని కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ ఎంపీలు కే మురళీధరణ్‌, కుంబకుడి సుధాకరన్‌, సురేష్‌ నారాయణ ధనోర్కర్‌, మహమ్మద్‌ ఫైజల్‌ అడిగిన ప్రశ్నకు జీ కిషన్‌రెడ్డి లోక్‌సభలో సమాధానమిచ్చారు. 
 
‘ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉద్యమిస్తున్న రైతులపై 39 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసు నమోదైందని చెప్పారు. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని టియర్‌గ్యాస్ వాడడాన్ని జీ కిషన్‌రెడ్డి సమర్థించారు.
 
 బారికేడ్లను తోసుకుంటూ ట్రాక్టర్లతో ర్యాలీగా ఢిల్లీలోకి వచ్చేందుకు రైతులు ప్రయత్నించడంతో వారిని అడ్డుకోవడంలో భాగంగానే లాఠీచార్జీ చేశామని, భాష్పవాయు ప్రయోగించామని ఢిల్లీ పోలీసులు చెప్పారని కిషన్‌రెడ్డి తెలిపారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించారని, ప్రభుత్వ ఉద్యోగులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు తమ నేర శక్తిని ఉపయోగించారని, ఫలితంగా ఎందరో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.
 
 అదేవిధంగా, ఉద్యమంలో ఉన్న రైతులు, ఆందోళనాకారులు కరోనా మహమ్మారి మార్గదర్శకాల మేరకు ఫేస్‌ మాస్కులు వాడకుండా పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారని, రైతుల చర్యలను అడ్డుకుని జనాన్ని నియంత్రించేందుకు టియర్‌గ్యాస్‌, వాటర్ ఫిరంగులు ఉపయోగించడం మినహా మరో మార్గం లేకపోయిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.