
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఈ దేశానికి రాజ్యాంగబద్దమైన అధిపతి అనీ.. రాజకీయాలకు అతీతమైన ఆయన ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడం దురదృష్టకరమంటూ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు.
దాదాపు 20 పార్టీలు.. ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడంపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసలు సమస్య ‘‘అహంకారమే’’ననీ ధ్వజమెత్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా తమదే అధికారం అన్నట్టు ఆ పార్టీ భావిస్తోందని ఆయన మండిపడ్డారు.
‘‘ప్రతిపక్షాలు పార్లమెంటరీ మర్యాదలను ఉల్లంఘించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినప్పటికీ బీజేపీ ఎన్నడూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించలేదు…’’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ నెల 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసను కాంగ్రెస్ పార్టీ ఖండించలేదనీ, ఎర్రకోటపై జాతీయ జెండాకు అవమానం జరిగినా కనీసం ఆ పార్టీ స్పందించలేదంటు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ నినాదాలు చేయడం తీవ్రంగా బాధించిందని తెలిపారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్