మ‌మ‌తాబెన‌ర్జికి మ‌రో ఎమ్యెల్యే దూరం 

మ‌మ‌తాబెన‌ర్జికి మ‌రో ఎమ్యెల్యే దూరం 

ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జికి మ‌రో ఎమ్యెల్యే దూరమయ్యారు.  ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మ‌మ‌తా బెన‌ర్జి నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తుండగా,  తాజాగా మ‌రో ఎమ్మెల్యే త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. 

రాష్ట్ర ‌మాజీ మంత్రి రాజీవ్ బెన‌ర్జి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. దీంతో గ‌త కొద్ది రోజుల వ్య‌వ‌ధిలోనే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన తృణ‌మూల్ ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది.  అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ ఇప్ప‌టికే డ‌జ‌న్‌ మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డం అంటే తృణ‌మూల్ కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. 

అంతేగాక రాజీనామా చేసిన డ‌జ‌న్‌ మందిలో సువేందు అధికారి త‌ర్వాత రాష్ట్రంలో అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ క‌లిగిన నేత రాజీవ్ బెన‌ర్జి కావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే అమిత్ షా బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన రోజే రాజీవ్ బెన‌ర్జి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అమిత్ షా స‌మ‌క్షంలో రాజీవ్ బీజేపీలో చేరుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా అనంత‌రం రాజీవ్ బెన‌ర్జి చేసిన వ్యాఖ్య‌లు కూడా ఆయ‌న బీజేపీలో చేర‌నున్నార‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. శుక్ర‌వారం ఉద‌యం అసెంబ్లీకి వెళ్లిన రాజీవ్ బెన‌ర్జి స్పీక‌ర్ బిమ‌న్ బెన‌ర్జిని క‌లిసి త‌న రాజీనామా లేఖ స‌మ‌ర్పించారు. 

ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్ర‌స్తుతం ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్ర‌మే రాజీనామా చేశాన‌ని, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాన్ని వ‌దులుకోలేద‌ని చెప్పారు. అయితే, రేపోమాపో పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం నుంచి కూడా వైదొలిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని చెప్పారు.