దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే

దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే
హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తప్పుబట్టారు. పాకిస్థాన్‌లోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నామన్నారు. దేవుడిపై భారం వేయడం సీఎం జగన్ ఉదాసీనతేనని చెప్పారు. దేవుడి విగ్రహం ధ్వంసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారని విమర్శించారు.
ఈ ఘటనలకు ప్రతిపక్షాలే కారణమని అధికార పక్షం చెబుతోందని, మరి వారి చేతుల్లోనే పోలీస్‌, నిఘా విభాగాలు ఉంటాయి కదా? అని ఆయన ప్రశ్నించారు. బాధ్యులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్‌ చేయలేదని పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు.

ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో శ్రీరామనగర్‌లోని విఘ్నేశ్వరాలయంలో విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాలయంలో విగ్రహం రెండు చేతులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత హిందూ వ్యతిరేక శక్తులు ఒక పథకం ప్రకారమే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నాయి. దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయకపోవడం, కనీసం కేసులు నమోదు చేయకపోవడం దారుణం. హిందువుల మనోభావాలు సీఎం జగన్‌రెడ్డికి అవసరం లేదా?’’ అని బజరంగ్‌దళ్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో కోఠి చౌరస్తాలో జగన్మోహన్‌ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చందర్‌ మాట్లాడుతూ ఆంధ్రాల్లో పథకం ప్రకారం దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటు దోషులను పట్టుకునేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.