జైలులో కరోనా గురించి చెప్పిన చైనా జర్నలిస్ట్ 

క‌రోనా గురించి ప్ర‌పంచానికి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించిన స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్ట్ ఝాంగ్ ఝాన్‌ (37)ను జైల్లో వేసింది చైనా. ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. క‌రోనా వెలుగు చూసిన కొత్త‌లో ఝాంగ్‌.. వుహాన్ న‌గ‌రంలో మూడు నెల‌ల పాటు ఈ వైర‌స్ గురించి రిపోర్ట్ చేసింది.
ప్ర‌భుత్వ ఆదేశాలను ధిక్క‌రించే వారు, మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌పై మోపే క‌ఠిన‌మైన సెక్ష‌న్ల కింద ఝాంగ్‌పై కేసులు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఝాంగ్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో షాంఘై నుంచి 400 మైళ్లు ప్ర‌యాణించి, వుహాన్‌లో క‌రోనా వైర‌స్ సృష్టించిన బీభ‌త్సాన్ని ప్ర‌పంచం దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది.
క‌రోనాతోపాటు క‌ఠిన‌మైన లాక్‌డౌన్ వ‌ల్ల వుహాన్ ప్ర‌జ‌లు ప‌డిన ఇబ్బందులు, అక్క‌డి ఆసుప‌త్రుల్లో రోగులు ప‌డుతున్న బాధ‌ల గురించి మూడు నెల‌ల పాటు రిపోర్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను వీచాట్‌, ట్విట‌ర్‌, యూట్యూబ్‌ల‌లో పోస్ట్ చేసేది. కొంత కాలం త‌ర్వాత ఆమె ట్విట‌ర్‌, యూట్యూబ్‌ల‌ను చైనా బ్లాక్ చేసింది.
మే నెల‌లో స‌డెన్‌గా ఆమె పోస్ట్‌లు ఆగిపోయాయి. పోలీసులు ఆమెను నిర్బంధించి బ‌ల‌వంతంగా షాంఘై తీసుకొచ్చారు. నిర్బంధంలోనే ఝాంగ్ నిరాహార దీక్ష చేసింద‌ని ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌నల్ వెల్ల‌డించింది. ఆమెకు బ‌ల‌వంతంగా ట్యూబు ద్వారా ఆహారం అందించారు పోలీసులు. ఆమె పూర్తిగా తప్పుడు స‌మాచారం పోస్ట్ చేసింద‌ని, అంత‌ర్జాతీయ మీడియా నుంచి ఇంట‌ర్వ్యూల‌ను అందుకున్న‌ద‌ని చైనా ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది.