
కరీంనగర్‌లో కొత్త వైరస్ (స్ట్రెయిన్ కరోనా) కలకలం రేపుతోంది. బ్రిటన్ లో వెలుగు చూసిన ఈ స్ట్రెయిన్ వైరస్ పై కరీంనగర్ లో ఆందోళన నెలకొంది. బ్రిటన్ నుంచి ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాకు 16 మంది వచ్చారని సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు.
వారికి వైరస్ పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు. జిల్లా వైద్యాధికారిణి సుజాత దీని గురించి మాట్లాడుతూ 16 మంది వ్యక్తులు బ్రిటన్ నుంచి వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందిందని, వీరిలో పది మంది కరీంనగర్ జిల్లా వాసులను గుర్తించి శాంపిల్ తీసుకుని పరీక్షలకు పంపించామని తెలిపారు.
మరో నలుగురు పెద్దపల్లి జిల్లా వాసులు కావడంతో అక్కడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. మరొకరు వరంగల్ జిల్లా కాగా ఇంకొకరు తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు.
ఇంగ్లాండ్ నుంచి వచ్చి కరీంనగర్ లో ఉన్న మరో ఇద్దరి (వేరే జిల్లా వాసులు) సమాచారం కూడా సేకరిస్తున్నట్లు సుజాత తెలిపారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఎయిర్ పోర్టులో చేసిన ఆర్. టి.పి.సి.ఆర్ పరీక్షలో నెగిటివ్ అని తేలిన తర్వాతే ఇళ్లకు వచ్చారని, అయినా ముందు జాగ్రత్తగా మరోసారి పరీక్షలు చేస్తున్నామని ఆమె తెలిపారు.
వీళ్లంతా ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆదేశించినట్టు ఆమె చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని, స్వీయ నియంత్రణతో తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను సమూలంగా ఎదుర్కోవచ్చని ఆమె తెలిపారు.
ఇలా ఉండగా, గత కొన్నిరోజులుగా బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణీకుల్లో 22 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో 11 మంది, అమృత్‌సర్‌లో 8 మంది, కోల్‌కతాలో ఇద్దరు, చెన్నైలో ఒకరు పాజిటివ్‌గా తేలారు. బ్రిటన్ నుండి ఇండియాకు వచ్చిన ప్రయాణీకులందరికీ ఆయా విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పరీక్షల ఫలితాల కోసం ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుల్లోనే ఉన్నారు. వీరందరూ తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు