
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో త్వరలో కొత్త ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి; తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ రానున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది.
న్యాయవాద వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ సీజేగా నియమించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదిస్తే తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఒక మహిళ పని చేయనున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్న జస్టిస్ హిమా కోహ్లీ 1959 సెప్టెంబరు 2న ఢిల్లీలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ (హిస్టరీ) పూర్తి చేసిన అనంతరం న్యాయశాస్త్రం చదివారు. 1984లో లా డిగ్రీ పొంది, అదే సంవత్సరం ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు.
1999-2004 మధ్య ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్)గా విధులు నిర్వర్తించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కమిషన్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌లతోపాటు పలు బ్యాంకులకు, ప్రైవేటు సంస్థలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.
2006 మే 29వ తేదీన ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆమె 2007 ఆగస్టు 29వ తేదీన శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, ఈ ఏడాది జూన్ 30వ తేదీ నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా అరూప్ కుమార్ గోస్వామిని నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. ఆయన 1961 మార్చి 11న అసోంలోని జార్హట్‌లో జన్మించారు. గువాహటి యునివర్సిటీ పరిధిలోని కాటన్ కాలేజీ నుంచి 1981లో డిగ్రీ (ఎకనామిక్స్) చేశారు. 1985లో గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.
అదే సంవత్సరం ఆగస్టు 16న ఈశాన్య రాష్ట్రాల (అసోం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్) బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అక్కడే స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.
అసోం ప్రభుత్వ విద్యాశాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. 2011 జనవరి 24న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2012 నవంబరు 7న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. రెండు విడతల్లో కొంతకాలం గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 అక్టోబరు 15 నుంచి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి