రజనీకాంత్‌ పార్టీ  ‘మక్కల్ సేవై కర్చీ’, గుర్తు ఆటో 

రజనీకాంత్‌ పార్టీ  ‘మక్కల్ సేవై కర్చీ’, గుర్తు ఆటో 
తన రాజకీయ ప్రవేశం గురించి నిర్దిష్టమైన ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్తగా ప్రారంభించబోయే పార్టీకి  ‘మక్కల్ సేవై కర్చీ'( ప్రజాసేవ పార్టీ ) అనే పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తును ఆటగా నిర్ణయించిన్నటు చెబుతున్నారు. 
 
ఈ నెల 31న పార్టీ పేరును ప్రకటిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త పార్టీకి చీఫ్‌ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌ను నియమించుకున్నారు. 
 
కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలపై కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు. గతవారంలో ముఖ్యనేతలతోనూ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున ప్రకటించే పేరు, గుర్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.  రజనీకాంత్‌ నటించిన భాషా సినిమాలో ఆటో డ్రైవర్‌గా‌ కనిపించారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకుముందు రజినీ ‘బాబా లోగో’ను కోరగా  దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను ఈ నెలాఖరున రజనీకాంత్‌ స్వయంగా వెల్లడించనున్నారు. 
‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా గెలుస్తాం. నిజాయితీ, పారదర్శకత, అవినతి రహిత, కుల, మతాలతో ప్రమేయం లేని ఆధ్యాత్మిక రాజకీయాలను అందిస్తాం’ అని రజినీ కాంత్ ఇటీవల ప్రకటించారు. ఆయన నుంచి తదుపరి ప్రకటన ఈనెల 31న వెలువడుతుందని చెబుతున్నారు.