రైతులతో చర్చలకు నితిన్ గడ్కరీ సిద్ధం 

రైతులతో చర్చలకు నితిన్ గడ్కరీ సిద్ధం 
ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని  కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.   పదివేల మంది పేద రైతులు ప్రాణాలు తీసుకున్న విదర్భ నుంచి తాను వచ్చానని ఆయన గుర్తు చేశారు.   
 
కొన్ని శక్తులు రైతులను తప్పుదారి పట్టిస్తూ, ఆందోళనలను దుర్వినియోగం చేస్తున్నాయని  ఆందోళన వ్యక్తం చేశారు. అన్నా హజారే ఈ ఉద్యమంలో చేరతారని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని తెలుపుతూ చర్చలు జరపకపోతే సమాచార లోపం ఏర్పడి వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రైతులకు వ్యతిరేకంగా తమ ఏం చేయలేదని స్పష్టం చేశారు. 

 రైతులు చేస్తున్న సూచనలు సరైనవేనని చెప్పిన గడ్కరీ చట్టాలు సవరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే రైతులు ముందుకొచ్చి చట్టాలను అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు. 

తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెబుతూ వారిచ్చే విలువైన సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వంలో  రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు.   తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్, ట్రేడర్ సహా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉందని తెలిపారు. 

కాగా,  భారతదేశం ప్రస్తుతం రూ. 8 లక్షల కోట్ల విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని, ప్రభుత్వం ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్ల విలువైన ఇథనాల్ వినియోగించాలని చూస్తోందని గడ్కరీ వెల్లడించారు. 

ప్రస్తుతం ఇథనాల్ వినియోగం రూ. 20 వేల కోట్లు మాత్రమే ఉందని పేర్కొంటూ రూ. 2 లక్షల కోట్ల ఇథనాల్ ఎకానమీ సాధిస్తే రూ. 1 లక్ష కోట్లు రైతుల జేబుల్లోకే వెళ్తాయని తెలిపారు.  రానున్న రోజుల్లో విమానాలు ఇథనాల్‌తో తయారు చేసిన ఇంధనాన్ని వినియోగించి ఎగురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ డబ్బంతా రైతులకే వెళ్తుందని అంటూ “ఇదే మా విజన్,  డ్రీమ్” అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. .