ఏపీ రాజధాని అమరావతి… మూడు రాజధానులకు వ్యతిరేకం 

ఏపీ రాజధాని అమరావతి… మూడు రాజధానులకు వ్యతిరేకం 
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని బిజెపి కోరుకొంటున్నదని, తాము ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని వ్యతిరేకిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. 
 
రాజధాని మార్పు ప్రక్రియకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన దీక్షలు 366వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన దీక్ష శిబిరం సందర్శించి  సంఘీభావం తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బిజెపి లక్ష్యమని, అందుకోసం పార్టీ తరపున ఉద్యమిస్తామని కూడా ప్రకటించారు.
 
గుంటూరు జిల్లా తుళ్లూరులో ‘భారతీయ కిసాన్ సంఘ్’ చిన్న, సన్నకారు రైతుల సమ్మేళనంలో పాల్గొంటూ  ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ వెంటనే రైతు నాయకులతో మాట్లాడాలని ఆయన హితవు చెప్పారు. 
 
బీజేపీ నాయకులం ఎప్పుడూ రెండు నాలుకలతో మాట్లాడరని ఆయన భరోసా ఇచ్చారు. రాజధానితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని, 64వేల ప్లాట్ పోగా మిగిలిన భూమిని అభివృద్ధి చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. 
 
ఒకవేళ రాజధాని వైజాగ్‌కు తరలించినా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇక్కడే ఉంటాయని, అందుకే తమ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలోనే నిర్మిస్తున్నామని తెలిపారు.  దుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌లు, ఎయిమ్స్ బీజేపీ వల్లే ఈ ప్రాంతంలో వచ్చాయని గుర్హ్టు చేశారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
 
“మోదీ, వీర్రాజు మీతోనే (అమరావతి ప్రజలు)ఉన్నారు” అంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి మోదీ వల్లే జరిగిందని కూడా పేర్కొన్నారు. “2024 సంవత్సరంలో మాకు అధికారం ఇస్తే అమరావతిని రూ. 5000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. రైతుల ప్లాట్‌లకు రూ 2000 కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.