తిరిగి కోలుకొంటున్న భారత విమానాయనారంగం   

దేశంలో విమాన ప్రయాణాలు తిరిగి పుంజుకుంటున్నాయని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. కరోనాకు ముందున్న పరిస్థితులతో పోల్చితే దాదాపు 65 శాతం  సాధారణ స్థితి నెలకొందని చెప్పారు.

‘విమానయానం,  పర్యాటకంలకు ముందున్నవి మంచి రోజులే’ అనే అంశంపై శనివారం భారతీయ పర్యాటక, హోటళ్ల సంఘం నిర్వహించిన వెబినార్‌లో ఖరోలా పాల్గొంటూ  విమానయానం కోలుకుంటున్నందున పర్యాటక పరిశ్రమ కూడా తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.

కరోనాకు ముందు రోజూ 3.70-3.75 లక్షల మంది విమానాల్లో ప్రయాణించేవారని, కరోనా నేపథ్యంలో ఇది 79 వేలకు పడిపోయిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 2.50 లక్షలకు పెరిగిందని చెప్పారు. త్వరలోనే మునుపటి పరిస్థితులు వస్తాయన్న ఆశాభావాన్ని ఖరోలా వ్యక్తం చేశారు.

విమానయాన రంగం సాధారణ స్థితికి వస్తే పర్యాటక రంగం కూడా ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాబట్టి దేశీయ విమానయాన సంస్థలకు ఊతమిచ్చేలా పర్యాటక రంగ సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని ఖరోలా సూచించారు.

ప్రయాణాలు పెరిగేకొద్దీ ఆతిథ్య రంగానికీ కొత్త ఉత్సాహం వస్తుందని ఖరోలా చెప్పారు. వ్యాపార కార్యకలాపాలు కూడా పూర్వ స్థితికి వస్తే కార్పొరేట్లు, ఆయా సంస్థల ప్రతినిధుల రాకపోకలు పెరుగుతాయని పేర్కొన్నారు. కాలేజీలు తిరిగి ప్రారంభమైతే 2-3 నెలల్లో 80-90 శాతం సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయన్న విశ్వాసాన్ని కనబరిచారు.

అంతా కలిసి ముందుకెళ్తే గడ్డు పరిస్థితుల నుంచి త్వరలోనే గట్టెక్కగలమని భరోసా వ్యక్తం చేశారు. పర్యాటక వీసాలపై ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయానికివస్తే పరిశ్రమ త్వరగా బలపడగలదని చెప్పారు.