నివర్ తుఫాన్ తో ఏపీలో భారీ వర్షాలు 

నివర్ తుఫాన్ తో ఏపీలో భారీ వర్షాలు 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్  క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం తుపాను దక్షిణ రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై, అల్పపీడనంగా మార్పుతున్నట్లు వాతామరణశాఖ తెలిపింది.
 
రాబోయే ఆరు గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని,  దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో గడచిన 24 గంటల్లో ఏపీలో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 177 ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు రికార్డు అయినట్టు అధికారులు చెబుతున్నారు. నెల్లూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.
 
సోమశిలకు వరద నీరు పోటెత్తడంతో సోమశిల నుండి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
వెంకటగిరి మండలం ఏపీటీఎఫ్‌ కాలనీలో అత్యధికంగా 304 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా. కడప జిల్లా సంబేపల్లిలో అత్యల్పంగా 64.5 మిల్లీ మీటర్ల వర్షం రికార్డు అయ్యింది. ఇక, నెల్లూరు జిల్లాలోని 09 ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 72 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని 96 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు.

ఏపీలోకి డీప్ డిప్రెషన్‌గా మారి చిత్తూరు జిల్లాలోకి నివర్ తుఫాన్‌ ప్రవేశించినట్టు అధికారులు వెల్లడించారు. 4 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. మరో 24 గంటల పాటు నివర్ ప్రభావం ఏపీపై ఉంటుందన్న ఆయన, సముద్రంలోకి జాలర్లు ఎవ్వరూ వెళ్లలేదని హెచ్చరించారు.