అమరావతి నిర్మాణ వ్యయాలపై హైకోర్టు ఆదేశాలు 

రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేశారు? నిర్మాణ పనులు ఆగిపోవడంతో జరిగిన నష్టమెంత? తదుపరి పరిణామాలేమిటి? ఈ వివరాలను మంగళవారం తమ ముందుంచాలని అకౌంటెంట్‌ జనరల్‌ను  హైకోర్టు ఆదేశించింది. 

వివరాల సమర్పణలో విఫలమైతే అకౌంటెంట్‌ జనరల్‌ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. ఆయన వివరాలు సమర్పించలేకపోతే విజిలెన్స్‌, ఆదాయపు పన్నుల శాఖ నుంచి తెప్పించుకుంటామని తేల్చి చెప్పింది. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాల రూపకల్పన వెనుక దురుద్దేశముందని… వాటిని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, ఉన్నం శ్రావణ్‌ కుమార్‌ హైకోర్టును అభ్యర్థించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేసి, వారి హక్కులను హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మురళీధరరావు వివరించారు. 

రైతుల భూములు తీసుకున్నందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ మేరకు రైతులతో కుదిరిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కుదరదని స్పష్టం చేశారు.

 ‘‘రాజధానిని నిర్మిస్తామని భూములు తీసుకున్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం కుదరదు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రాజధాని రైతులు, సాధారణ ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని తెలిపారు. 

పైగా, ముఖ్యమంత్రి ఆకాంక్షమేరకే జీఎన్‌రావు కమిటీని ఏర్పాటు చేసినట్లుంది. ఆ కమిటీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సంప్రదించలేదు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కూడా అదే తరహాలో నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. 

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ రూపొందించిన నివేదికలు, ఆ నివేదికలను అధ్యయనం చేసి మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదిక ఒకే తరహాలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమకు సూచనలు చేయాలని బీఎ్‌సజీని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో  ఇవ్వలేదని వివరించారు. 

అయితే, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. 

విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ప్రభుత్వం చెబుతోందని,  కానీ, రైతుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్న సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని న్యాయవాది ఉన్నం శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.