
అమెరికా 48వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఏర్పాటుచేయబోయే మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతికి చెందిన వారికి చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల వేళ బైడెన్‌కు అడ్వైజర్‌గా పనిచేసిన వివేక్ మూర్తిని ఆరోగ్య, మానవ సేవల మంత్రిగా నియమించవచ్చని చెబుతున్నారు. అట్లాగే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్లు కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి.
బైడెన్ బృందంపై సంబంధించిన జాబితాను ఓ మీడియా సంస్థ విడుదల చేసింది. 43 ఏళ్ల వివేక్ మూర్తి ప్రస్తుతం కోవిడ్19 సలహాదారుల బృందంలో ఉన్నారు. కరోనా వైరస్ విషయంలో ఆయన బైడెన్‌తో కలిసి పనిచేస్తున్నారు.
స్టాన్‌ఫోర్డ్ లో మెకానిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా చేసిన మజుందార్ అక్కడే అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైరక్టర్‌గా చేశారు. ఎనర్జీ సంబంధిత అంశాల్లో బైడెన్‌కు సలహాదారుడిగా పనిచేశారు. తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్.. జనవరి 20వ తేదీన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇలా ఉండగా, అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్‌కు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు బైడెన్‌తో మోదీ తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. కమలా గెలుపు భారతీయ, అమెరికా ప్రజలకు గర్వకారణమని మోదీ తెలిపారు. బైడెన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండోపసిఫిక్ ప్రాంత సహకారం లాంటి అంశాలను కూడా చర్చించినట్లు మోదీ తన ట్వీట్‌లో తెలిపారు.
బైడెన్, మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై అమెరికా కూడా ప్రకటన జారీ చేసింది. స్వదేశంలో, విదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశమని అమెరికా తన ప్రకటనలో చెప్పింది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీతో కలిసి పనిచేయనున్నట్లు కొత్త అధ్యక్షుడు బైడెన్ ఆసక్తిగా ఉన్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?