లాడెన్‌తో పాక్‌  ఉన్నత సైనికాధికారుల దోస్తీ 

లాడెన్‌తో పాక్‌  ఉన్నత సైనికాధికారుల దోస్తీ 

ఉగ్రవాద నేత, అల్‌ఖాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌తో పాక్‌ సైన్యంలోని కొందరు సీనియర్‌ ఉన్నతస్థాయి అధికారులకు సంబంధాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వెల్లడించారు. అందుకే లాడెన్‌ను మట్టుపెట్టేందుకు పాక్‌ ప్రభుత్వ సాయం కోరలేదని, రహస్యంగా తామే ఆపరేషన్‌ నిర్వహించామని ’ది ప్రామిస్ట్‌ ల్యాండ్‌’ అనే తన పుస్తకంలో ఆయన రాశారు.

’’2011లో జరిపిన ఆ ఆపరేషన్‌ ముందు ఎంతో చర్చ జరిగింది. లాడెన్‌ అబోటాబాద్‌లో ఓ సురక్షిత ప్రదేశంలో ఉన్నట్లు సమాచారం సేకరించాం. ఆ కాంపౌండ్‌ పాక్‌ సైనిక స్థావరానికి కొద్ది మైళ్ల దూరంలో ఉంది” అని తెలిపారు. 

పాక్‌ను భాగస్వామిగా చేస్తే చాలా రిస్క్‌… ఎందుకంటే పాక్‌ సైనిక, నిఘా వర్గాల్లో ఉన్నతస్థాయి అధికారులకు అల్‌ఖాయిదాతో, లాడెన్‌తో సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం అని ఆయన పేర్కొన్నారు. 

భారత్‌, అఫ్గానిస్థాన్‌లకు వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్లలో అల్‌ఖాయిదాను పాక్‌ వ్యూహాత్మకంగా వాడుకొంటోందని ఒబామా తెలిపారు. “మేం ఆలోచించాం. పాక్‌కు తెలిస్తే లాడెన్‌ తప్పించుకుంటాడు” అని చెప్పారు. 

అందుకే వైమానిక దాడి జరుపుదామా లేక ఓ ప్రత్యేక కమాండో బృందం హెలికాప్టర్‌ ద్వారా ఆ కాంపౌండ్‌లో దిగి- లాడెన్‌ను హతమార్చి- పాక్‌ పోలీసులు, సైన్యానికి తెలిసేలోపుగా అక్కణ్ణుంచి వేగంగా నిష్క్రమిద్దామా… అని ఆలోచించాం. చివరకు రెండో మార్గాన్ని ఎంచుకున్నామని వెల్లడించారు. 

నాటి ఉపాధ్యక్షుడు జో  బైడెన్‌, రక్షణమంత్రి రాబర్ట్‌ గేట్స్‌ దీని పర్యవసానాలను ఆలోచించాలని హెచ్చరించారని తెలిపారు. విదేశాంగ మంత్రి హిల్లరీ 51-49 అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతా బృందంతో ఆలోచించాక- రంగంలోకి దిగాం. లాడెన్‌ను కడతేర్చామని వివరించారు. 

“ఆ తరువాత చాలా ప్రపంచ దేశాలకు ఫోన్లు చేశాం. అందరికంటే అతి క్లిష్టమైన కాల్‌ పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో.. ఎందుకంటే పాక్‌ సార్వభౌమత్వాన్ని అతిక్రమించి చేసిన పని ఇది. అయితే నేను ఫోన్‌ చేయగానే ఆయన నాకు కంగ్రాట్స్‌ చెప్పారు” అని ఒబామా వెల్లడించారు. 

తన భార్య బేనజీర్‌ భుట్టో హత్య వెనుక తాలిబాన్‌, అల్‌ఖాయి దా పనిచేశాయంటూ భావోద్వేగంతో నిజాయితీగా మాట్లాడారని ఒబామా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.