గ్రేటర్ లో 100 సీట్ల గెలుపుపై బీజేపీ దృష్టి 

గ్రేటర్ లో 100 సీట్ల గెలుపుపై బీజేపీ దృష్టి 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 100 సీట్లను గెల్చుకొనే లక్ష్యంగా బిజెపి వాడి, వేడిగా అడుగులు వేస్తున్నది. పార్టీ జాతీయ నాయకత్వం సహితం ప్రత్యేక దృష్టి సారించి పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ను ఇన్ ఛార్జ్ గా నియమించింది. 

ఇప్పటి నుండి అభ్యర్థుల ఎంపిక పక్రియను ప్రారంభించింది.  బీజేపీ తరుపున పోటీకి ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి బయోడేటాలను స్వీకరించనుంది. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆశావాహుల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు బయోడేటాలు తీసుకోనున్నారు.

గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను బీజేపీ నియమించింది. డివిజన్లు వారీగా అభ్యర్థుల పనితీరుపై రాష్ట్ర నాయకత్వం సర్వే చేయించనుంది. సర్వేలో ముందు వరుసలో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని బీజేపీ చెబుతోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కన్నేసింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించేసింది.

దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావుతో పాటు మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జిగా నియమితులైన సీనియర్‌ నేత పి.మురళీధర్‌రావు, కర్ణాటక సహ ఇన్‌చార్జి డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్‌చార్జిగా నియమితులైన పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శాలువాతో సన్మానించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు