కునాల్ పై కోర్ట్ ధిక్కరణ కేసుకు అనుమతి 

కునాల్ పై కోర్ట్ ధిక్కరణ కేసుకు అనుమతి 
సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ట్వీట్లు చేశారంటూ ప్రముఖ కమెడియన్‌ కునాల్‌ కమ్రా  కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోనున్నారు. ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో రిపబ్లిక్‌ టివి చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
 
ఈ తీర్పును విమర్శిస్తూ సుప్రీంకోర్టుపై .. కునాల్‌ కమ్రా కొన్ని ట్వీట్లు చేశారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలంటూ ఇద్దరు న్యాయవాదులు, ఒక న్యాయ విద్యార్థి అటార్నీ జనరల్‌ కెకె.వేణుగోపాల్‌ సమ్మతి కోరుతూ పిటిషన్‌ పంపారు. 
 
వారు పిటిషన్‌ పంపి 24 గంటలు గడవక ముందే అటార్నీ జనరల్‌ అనుమతిని జారీ చేశారు. సుప్రీంకోర్టుపై దాడి చేయడం చట్ట రీత్యా నేరమని, ఈ నిర్ణయం శిక్షకు దారితీస్తుందని ప్రజలు అర్థం చేసుకోవలసిన సమయమిదని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. కమెడియన్‌ ట్వీట్లు తప్పుడు అభిరుచిని వ్యక్తం చేయడంతో పాటు హాస్యం కూడా పరిధిని దాటినట్లు స్పష్టమైందని తెలిపారు. 
 
ఈ ట్వీట్లు సుప్రీంకోర్టుపై, న్యాయమూర్తులపై పరోక్ష నిందకు పాల్పడినట్లు ఉన్నాయని, దీంతో సుప్రీంకోర్టును, న్యాయమూర్తులను విమర్శించడాన్ని నేడు ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించే అవకాశం ఉందని వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అర్ణబ్‌ గోస్వామిని గేలి చేశారంటూ ఈ ఏడాది జనవరిలో కునాల్‌ విమాన ప్రయాణంపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. అప్పటి నుండి కునాల్‌కు, అర్ణబ్‌కు మధ్య వివాదం నడుస్తోంది.