తలలను తెగ్గోయడంపై పాక్ లో బాలికలకు శిక్షణ 

ఇప్పటికే ఉగ్రవాదులకు అడ్డాగా  ప్రపంచం ముందు దోషిగా నిలబడుతున్న పాకిస్థాన్ లో తాజాగా తాజాగా  అమాయకుల తలలు తెగ్గోయడానికి బాలికలకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలతో ఒక వీడియో బయటపడటం విభ్రాంతి కలిగిస్తుంది. పైగా ఈ శిక్షణ కార్యక్రమాలు మతపరమైన బోధనలు చేసే పాఠశాలల్లో జరుగుతున్నాయి.

ఉత్తర అమెరికాకు చెందిన మాజీ ముస్లింలు ఓ వీడియోను ట్వీట్ చేయడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మనుషుల మెడలను పదునైన కత్తితో తెగ్గోయడం గురించి పాకిస్థాన్‌లోని  మతపరమైన పాఠశాలలో బాలికలకు శిక్షణ ఇస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. 

మహమ్మద్ ప్రవక్తను అవమానించినవారి తలలు తెగ్గోయాలనే నినాదాలను ఈ శిక్షణలో పాల్గొన్న బాలికలు, బోధకులు ఇస్తున్నారు. ఫ్రాన్స్‌ను, మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ గీసిన కార్టూనిస్టులను, ఇస్లాం వ్యతిరేకులను వీరు హెచ్చరించారు. 

బురఖాలు ధరించిన యువతులు, బాలికలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఓ దిష్టి బొమ్మ తలను తెగనరకడం గురించి ఓ యువతి వివరించింది. ఆమెను మిగిలినవారంతా అనుకరించారు. ఇస్లాం వ్యతిరేకులను హెచ్చరిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

మహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసేవారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం తాము రక్తం చిందించడానికి సైతం వెనుకాడబోమని ఓ యువతి చెప్పింది.  ఫ్రాన్స్‌లోని ‘ఛార్లీ హెబ్డో’ మ్యాగజైన్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కార్టూన్‌ను ఇటీవల పునర్ముద్రించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వీడియోలను చూసినవారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అన్ని సామాజిక మాధ్యమాల వేదికల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు అంగీకారయోగ్యం కానిదాని పట్ల తమ మనోభావాలను శాంతియుతంగా తెలియజేయడం నేర్పడానికి బదులుగా హింసను ప్రేరేపిస్తుండటం సరికాదని మండిపడుతున్నారు.