
దేశంలో కీలక వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశమున్నదని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే ఇది ద్రవ్యోల్బణం ఎంతమేరకు సద్దుమణుగుతుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.
‘ద్రవ్యోల్బణం మా అంచనాలకు అనుగుణంగా ఉంటే భవిష్యత్తులో రెపో, రివర్స్ రెపో రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశం ఉన్నదని నేను గుర్తించా. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ అవకాశాన్ని ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరమున్నది’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020-21) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గణనీయంగా తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు, హైఫ్రీక్వెన్సీ సూచీలు రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో కొంత మెరుగుపడ్డాయని దాస్ తెలిపారు. అయినా ఇప్పటికీ కొన్ని అనిశ్చిత పరిస్థితులున్నాయని, వీటిలో కొవిడ్-19 రెండో విడుత వ్యాప్తితో ఎదురవుతున్న ముప్పు ప్రధానమైనదని చెప్పారు.
దేశీయంగా ఆర్థిక పరిస్థితులు గణనీయంగా కుదుటపడినప్పటికీ ప్రైవేట్ పెట్టుబడులు పెద్దగా వచ్చే అవకాశాలు కనిపించడంలేదని, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యం గణనీయంగా క్షీణించడమే ఇందుకు కారణమని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.5 శాతం మేరకు క్షీణిస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నదని వెల్లడించారు.
ఖరీఫ్ దిగుబడులతోపాటు రబీ సీజన్ కూడా సానుకూలంగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సర ద్వితీయార్ధంలో ఆహార ద్రవ్యోల్బణం సద్దుమణుగుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం చివరి నాటికి ఇది మరింత తగ్గుతుందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
More Stories
పప్పుదినుసుల సేకరణపై పరిమితి తొలగించిన కేంద్రం
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి
డ్రగ్ మాఫియా నెట్ వర్క్ ఛేదించిన ఎన్ సి బి