బాలు మృతి ప‌ట్ల రాష్ట్ర‌‌ప‌తి, ప్ర‌ధాని సంతాపం

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 
 
‘భార‌త సంగీతం ఓ గొప్ప స్వ‌రాన్ని కోల్పోయింది అని రాష్ట్రపతి తెలిపారు. పాట‌ల చంద్రుడిగా ఎస్పీ బాలు అనేక పుర‌స్కారాలు అందుకున్నార‌ని పేర్కొన్నారు. గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది’ అని రాష్ట్రపతి ట్విటర్‌లో నివాళులు అర్పించారు. 
 
 బాలు మృతి దురదృష్టకర సంఘటన అని ప్రధాని మోడీ ట్విటర్‌లో పేర్కొన్నారు. దేశ సాంస్కృతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని అని త్లెఇపారు. బాలు సుమధుర గొంతుక యావత్‌ భారతంలోని ప్రతి ఇంటికి సుపరిచితమని ప్రధాని వ్యాఖ్యానించారు. 
 
దశాబ్దాలుగా పాటల ప్రపంచానికి సేవ చేసిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు.‘ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు, శేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’అని మోడీ ట్వీట్‌ చేశారు.
 
భారత దేశం గర్వించదగ్గ గాయకుడిగా పేరు పొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడిగా ఐదున్నర దశాబ్ధాల పాటు తన అద్భుత గానంతో ప్రజలను అలరింప చేశారని ఉపరాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. 
పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం తనకు దిగ్ర్బాంతిని కలిగించిందన్నారు.