కోటికిపైగా వలస కార్మికులు కాలినడకన వెనక్కి

కోటికిపైగా వలస కార్మికులు కాలినడకన వెనక్కి
కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో ఈ ఏడాది మార్చి-జూన్‌ మధ్యకాలంలో కోటికిపైగా వలస కార్మికులు కాలినడకన తమ స్వస్థలాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి వీకే సింగ్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం లాక్‌డౌన్‌ సమయంలో కాలినడకన వారితో సహా 1.06 కోట్ల మంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు.
తాత్కాలికంగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 2020 మార్చి-జూన్ కాలంలో రోడ్లపై (జాతీయ రహదారులతో సహా) 81,385 ప్రమాదాలు జరిగాయని, 29,415 మరణాలు సంభవించినట్లు ఆయన పార్లమెంట్‌కు తెలిపారు.
అయితే, లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వలస కార్మికుల విషయంలో మంత్రిత్వశాఖ ప్రత్యేక డేటాను నిర్వహించడం లేదని చెప్పారు. వలస కార్మికులకు షెల్టర్లు, ఆహారం, నీరు, ఆరోగ్య సదుపాయాలతో పాటు కౌన్సెలింగ్‌ అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వశాఖ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహాలు, సూచనలు ఇచ్చిందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ జాతీయ రహదారులపై కాలినడకన వెళ్లే కార్మికులకు ఆహారం, తాగునీరు, ఔషధాలు, చెప్పులు అందించడం ద్వారా వారికి సహాయపడిందని మంత్రి తెలిపారు.
స్థానిక పాలనా యంత్రాంగం సహాయంతో వారికి విశ్రాంతి కోసం వసతి కూడా కల్పించినట్లు చెప్పారు. ఏప్రిల్ 29, మే 1 నుంచి హోంశాఖ ఆదేశాల మేరకు బస్సులు, శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలించినట్లు వివరించారు.