వివాదాల సుడిగుండంలో ఎల్యేల్యే ఉండవల్లి శ్రీదేవి

వివాదాల సుడిగుండంలో ఎల్యేల్యే ఉండవల్లి శ్రీదేవి

ఏపీ రాజధాని అమరావతి నియోజకవర్గం తాడికొండ రిజర్వేడ్ స్థానం నుండి రాజకీయాలలో మొదటిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన వృత్తిరీత్యా డాక్టర్ అయినా ఉండవల్లి శ్రీదేవి మొదటి నుండి వివాదాలలో చిక్కుకొంటున్నారు. సొంత పార్టీ వారి నుండే చిక్కులు ఆమెకు ఎదురవుతున్నాయి. 

హైదరాబాద్‌లో డాక్టర్ వృత్తిలో ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే అధికార పక్షం నుండి గెలుపొందారు. . గతేడాది వినాయక చవితి పందిళ్లలోకి ఆమెను రానివ్వకపోవటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్దేశపూర్వకంగానే తనను పందిట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని శ్రీదేవి ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో కులవివక్ష ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత శ్రీదేవి ఎస్సీ కాదంటూ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు  ఫిర్యాదు చేశారు. తనకు అందిన ఫిర్యాదును రాష్ట్రపతి జిల్లా కలెక్టర్ కు పంపడంతో, దీనిపై జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు ఆమె హాజరయ్యారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఇటు సొంత పార్టీలోని నాయకులతో సైతం ఆమెకు విబేధాలు పొడచూపాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సొంత గ్రామం రాజధానిలో ఉండటంతో ఆయన పెత్తనంతో ఆమె విభేదించారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. అయితే దీనిపై పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చిన్నట్లు తెలుస్తున్నది.

కొద్దీ రోజుల క్రితం పెదకాకాని సమీపంలోని ఐజేఎం అపార్టుమెంట్‌లో కొంతమంది పేకాట శిబిరం నిర్వహిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు పేకాట శిబిరంపై దాడిచేసి 30 మంది వరకు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శిబిరం నిర్వాహకుడు చలివేంద్రం సురేశ్‌గా తేల్చారు.

అయితే ఆయన ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అని జోరుగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే ఉండవల్లి అండదండలతోనే శిబిరం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. దీనిపై డీజీపీకి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు.

ఇదిలా ఉండగానే, పేకాట శిబిరం నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్న రమణారెడ్డి, సందీప్, సురేశ్‌లను వైసీపీ నుండి బహిష్కరించారు. ఇది జరిగిన తర్వాత వారం రోజులకి మేకల రవి అనే వ్యక్తి తన నుంచి ఎమ్మెల్యే రూ 1.40 కోట్లు నగదు తీసుకునిరూ 60 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చారని స్వయంగా వెల్లడించారు.

మిగిలిన రూ 80 లక్షలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన పోస్ట్‌ చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన డబ్బులు తనకు ఇప్పించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే రవి విన్నవించుకున్నారు. ఈ వీడియో వివాదాస్పదం కావటంతో మండల పార్టీ నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజాగా అక్రమంగా మట్టి తరలిస్తున్న తన మద్దతుదారుల వాహనాలను పట్టుకున్నందుకు ఓ సీఐని శ్రీదేవి దుర్భాషలాడుతూ బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.