డ్రగ్స్‌ కేసులో కన్నడ తారలు రాగిణి, సంజన 

కర్ణాటకలో కలకలం రేపుతున్న శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో అందాల తారలు రాగిణి, సంజనల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారిద్దరి సన్నిహిత స్నేహితులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన అధికారులు ఇప్పుడు వారిపై దర్యాప్తు అధికారులు ద్రుష్టి సారిస్తున్నారు.
 
ప్రముఖ అందాల నటి రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్‌ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. రాగిణి పేరు ప్రచారంలోకి రావడంతో వారిద్దరికీ నోటీసులు పంపారు. అయితే రాగిణి హాజరు కాలేదు. రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని సమాచారం సేకరిస్తున్నారు. మరింత విచారణ కోసం కోర్టు అనుమతితో కస్టడీకీ తీసుకోవాలని నిర్ణయించారు. 
 
రాగిణికి శుక్రవారం హాజరు కావాలని మళ్లీ నోటీసులు పంపారు. బుధవారం రాత్రి నోటీసు ఇవ్వటానికీ పోలీసులు యలహంకలోని రాగిణి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవటంతో వాట్సాప్‌ ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆమె ముఖం చాటేస్తుండడంతో పోలీసుల్లో అనుమానం పెరిగింది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శుక్రవారం రాగిణి ఇంటిపై దాడి జరిపి, ఆమెను  అదుపులోకి తీసుకున్నారు.
మరోవంక, నటి సంజన గల్రాని ఆప్తుడు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రాహుల్‌ను సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనని శాండల్‌వుడ్‌లో నటీనటులు ఆందోళనకు గురవుతున్నారు. రాహుల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. 
 
అతని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు. రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు సంజన తెలిపారు. 
ఇలా ఉండగా, శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ మాఫియాకు ఒక వంక బాలీవుడ్‌తో, మరోవంక కర్ణాటక రాజకీయ నాయకులతో  సంబంధాలున్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరగి ఆరోపించారు. బాలీవుడ్‌తో సంబంధాలున్న ఇంతియాజ్‌ ఖాత్రిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.
ఇంతియాజ్‌ ఖాత్రితో బాలీవుడ్‌ నటీనటులు, నిర్మాతలకు మంచి సంబధాలున్నాయి. అతని పుట్టినరోజుకు సినీరంగ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇటీవల బెంగళూరులో ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు అతడు కూడా హాజరయ్యాడు అని చెప్పారు.