వ్యాక్సిన్‌ జాతీయవాదం శ్రేయస్కరం కాదు

వ్యాక్సిన్‌ జాతీయవాదం శ్రేయస్కరం కాదు
ఒకవైపు భూమండలాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తుండగా, వ్యాక్సిన్‌కు సంబంధించి పలుదేశాలు అనుసరిస్తున్న జాతీయవాదం ఎంతమాత్రం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చీఫ్‌ సైంటిస్టు సౌమ్య స్వామినాధన్‌ హెచ్చరించారు. 
 
లారెన్స్‌ దానా పింకం స్మారక ప్రసంగం సందర్భంగా ‘కోవిడ్‌-19 – తెలుసుకోవాల్సిన అంశాలు, మీడియా పాత్ర’ పై ఆమె మాట్లాడుతూ  దాదాపు 200 కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి  చేస్తున్న దశలో ఉండగా, వాటిలో 27 కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయని చెప్పారు. చాలా దేశాలు తాము అభివృద్ధి  చేస్తున్న వ్యాక్సిన్‌ తమ దేశ ప్రజల కోసమే వినియోగించాలన్న సంకుచిత భావంతో అలోచిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. 
 
ఈ విధమైన వ్యాక్సిన్‌ జాతీయవాదం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఆమె స్పష్టం చేశారు. ‘ఈ వైరస్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఇటువంటి సమయంలో ప్రపంచం తిరిగి సాధారణ దిశకు వెళ్లే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే తప్ప ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా లేదు’ అని గుర్తు చేశారు. 
 
మంది నేతలు తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు అలోచిస్తున్నారని, ఇది చాలా కష్టతరమైన సమస్య అని ఆమె పేర్కొన్నారు. తమ దేశ పౌరులను రక్షించుకోవడం వారి బాధ్యత, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా సమానంగా చూసి వారిని కూడా ఈ మహమ్మారి సంక్షోభం నుంచి బయట పడేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె హితవు చెప్పారు. 
 
2021 ప్రారంభానికి వ్యాక్సిన్‌ డోసులు పరిమితంగా ఉంటే.. వాటిని వైరస్‌ భారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఇతర సిబ్బందికి పంపిణీ చేయాలని తాము ప్రతిపాదిస్తున్నామని ఆమె తెలిపారు.