భారత్ భూభాగంపై కన్నేస్తే ఇక భయమే 

భారత్ భూభాగంపై కన్నేసిన వారికి మన కొత్త సత్తా చూస్తే భయం కలగడం ఖాయమని   రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.  బుధవారం భారతదేశానికి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు అరుదెంచిన దశలో రక్షణమంత్రి స్పందిస్తూ ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు భారతీయ వైమానిక దళం మరింత బలోపేతం అయిందని, ఇక ఏ శక్తి మన గగనతలం వైపు కన్నెత్తి విద్వేషంతో చూడలేదని స్పష్టం చేశారు.

దేశ ప్రాదేశిక సమగ్రత, భద్రతకు ముప్పు కల్గించే శక్తులకు ఇప్పుడు వణుకు పుట్టాల్సిందే అని తేల్చి చెప్పారు. చైనాతో తూర్పు  లద్ధాఖ్ ప్రాంతంలో నెలకొని ఉన్న సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఈ ప్రాంతంలో చైనా బహుముఖ రీతిలో తన యుద్ధ విమానాల బలగాలను పెంచుకుంది. ఇతరత్రా వైమానిక వనరులను బలోపేతం చేసుకుంది. 

ఓ వైపు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నా చైనా మరోవైపు తన సైనిక పాటవాన్ని విస్తృతపర్చుకోవడం జరుగుతోంది. ఈ దశలో దీనికి దీటుగా బహుముఖ స్థాయిలో రక్షణ బలగాల పటిష్టతకు ప్రత్యేకించి వైమానిక దళం బలోపేతానికి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చైనా వద్ద జె 20 చెంగ్డు జెట్స్ ఉన్నాయి. వీటిని ఐదోతరం యుద్ధ విమానాలుగా పిలుస్తారు.

నాలుగున్నర తరాల రాఫెల్స్‌తో పోలిస్తే చైనా ఫైటర్లు సామర్యం ఎక్కువనే.  అయితే ఇప్పటివరకూ ఈ చైనా ఫైటర్ల సామర్థం వాస్తవికంగా నిరూపితం కాలేదు. అయితే రాఫెల్ యుద్ధ పటిమ పలుసార్లు పలు చోట్ల నిరూపితం అయింది. అఫ్ఘనిస్థాన్, లిబియా, మాలీ వంటి చోట్ల రాఫెల్స్ సైనిక చర్యలలో రాఫెల్స్ శక్తి నిరూపితం అయింది.

ఐఏఎఫ్ అవసరాలను గుర్తించే రాఫెల్ జెట్లు  కొనుగోలు చేశామని, వీటికి సంబంధించి వచ్చిన ఆరోపణలు నిజంకాదని ఇప్పటికే నిరూపించామని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన స్పష్టం చేశారు.  ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్స్ను తీసుకొచ్చిన ఐఏఎఫ్ ను  ఆయన అభినందించారు.

ప్రధాని మోడీ తీసుకున్న సరైన నిర్ణయం కారణంగానే ఈ ఒప్పందం పూర్తయ్యిందని, ఆయన ధైర్యానికి , నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి, దస్సాల్ట్ ఏవియేషన్కు కూడా ధన్యవాదాలు చెప్పారు.