సుర్జేవాలా, గోవింద్‌ సింగ్‌ లపై బిజెపి కేసు

రాజస్థాన్‌లో ఆడియో టేపుల కలకలంతో మరో కొత్త రగడ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ నేతలు రణదీప్‌ సుర్జేవాలా, గోవింద్‌ సింగ్‌ దోస్తారాలపై బిజెపి నేత లక్ష్మీకాంత్‌ భరద్వాజ్‌ కేసు నమోదు చేశారు. 
 
రాజస్థాన్‌లో అశోక్‌గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, బిజెపి నేత సంజరు జైన్‌ కుట్రలు పన్నారంటూ రాజస్థాన్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌ఒజి)కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మహేష్‌ జోషి ఫిర్యాదు మేరకు ఎస్‌ఒజి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.
 
అయితే, ఫేక్‌ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. మహేష్‌జోషి, రణదీప్‌ సుర్జేవాలా, ఇతర నిందితులు బిజెపి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తరచూ ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
దీంతో కాంగ్రెస్‌లో ప్రారంభమైన తిరుగుబాటు రాజకీయాలకు కారణం బిజెపినేనని తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని రాజస్తాన్‌ బిజెపి అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్‌ భరద్వాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
చీఫ్‌ విప్‌ మహేష్‌ జోషి, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా, రాజస్తాన్‌ పిసిసి చీఫ్‌ గోవింద్‌ సింగ్‌, రాష్ట్ర సిఎం అశోక్‌గెహ్లాట్‌ వద్ద ఒఎస్‌డిగా పనిచేస్తున్న లోకేష్‌ శర్మలను నిందితులుగా పేర్కొన్నారు. ఫేక్‌ ఆడియోతో బిజెపి ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ నివాసంలో ఒఎస్‌డి లోకేష్‌ శర్మ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగుతున్నాయని ఆరోపించారు.