రామాలయ నిర్మాణ పనులు నిలిపివేత 

రామాలయ నిర్మాణ పనులు నిలిపివేత 

చైనాతో ల‌డ‌ఖ్ విష‌యంలో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం ప‌నుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు రామ‌మందిర ట్ర‌స్టు ప్రకటించింది. చైనాతో స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌రిస్థితి భీక‌రంగా ఉంద‌ని, ఇప్పుడు దేశాన్ని ర‌క్షించుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని రామ‌మందిర ట్ర‌స్టు పేర్కొన్న‌ది.

గాల్వ‌న్ లోయ‌లో భార‌త‌, చైనా బ‌ల‌గాలు హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌కు దిగిన విష‌యం తెలిసిందే.  ఆ గొడ‌వ‌లో భార‌త సైన్యానికి చెందిన 20 మంది సైనికులు అమ‌రుల‌య్యారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన చ‌రిత్రాత్మ‌క తీర్పును ఆధారంగా చేసుకుని.. రామ‌మందిర ట్ర‌స్టు అయోధ్య‌లో ఆల‌య నిర్మాణ ప‌నుల‌కు శ్రీకారం చుట్టాల‌నుకున్న‌ది. ఇప్ప‌టికే కొన్ని పూజ‌లు జ‌రిగాయి.  ఇటీవ‌లే అక్కడ శివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. 

ప్ర‌ధాని మోదీ చేతుల‌గా మీదుగా అధికారిక ప‌నులు ప్రారంభం కావాల్సి ఉన్న‌ది. కానీ ఆ ముహూర్తాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ట్ర‌స్టు చెప్పింది. 

‘‘దేవాలయ నిర్మాణం పనులు ప్రారంభించే నిర్ణయం దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం”అని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. భారత్ – చైనా సరిహద్దులో ఉద్రిక్త  వాతావరణం నెలకొని ఉన్న ఇలాంటి సమయంలో ఆలయ భూమి పూజ నిర్వహించడం సరికాదని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

రామ మందిరాన్ని నిర్మించేందుకు భూమి చదును పనులను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. లాక్​డౌన్ కారణంగా నిలిచిపోయిన పనులు కాస్తా సడలింపుల మేరకు ఈ మధ్యే మళ్లీ ప్రారంభయ్యాయి. వచ్చే నెల మొదటి వారంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని నిర్ణయించిన యూపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా పనులు కొనసాగిస్తోంది.