
దేశంలోని మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు జూన్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. జూన్ 1 నుంచి బుధవారంనాటికి పదిరోజుల్లోనే కొత్తగా 90 వేల కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే, దేశంలోని మొత్తం మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు కూడా గత పదిరోజుల్లోనే నమోదైనట్టు వెల్లడించింది.
దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న వెలుగుచూసింది. కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి వందకు పైగా రోజులు పట్టింది. మే 18న దేశంలో వైరస్ కేసులు లక్షకు చేరుకున్నాయి. అయితే, మరో లక్ష కేసులు నమోదుకావడానికి 17 రోజుల (జూన్ 2) సమయం మాత్రమే పట్టింది.
జాన్ హాప్కిన్స్ గణాంకాల ప్రకారం కరోనా మరణాల్లో దేశం 12వ స్థానంలో ఉండగా, రికవరీలో తొమ్మిదో స్థానానికి చేరుకోవడం కొంత ఊరటను కలిగిస్తున్నది. మరోవైపు, దేశంలో బుధవారంనాటికి 50,61,332 నమూనాల్ని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. గత 24 గంటల్లో 1,45,216 నమూనాల్ని పరీక్షించినట్టు వెల్లడించింది.
అయితే దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి తొలిసారిగా యాక్టివ్ కేసుల (చికిత్స తీసుకుంటున్న వారి) కంటే కోలుకున్న రోగుల సంఖ్య పెరగడం కొంత ఉపశమనాన్నిస్తున్నది. బుధవారానికి మొత్తం పాజిటివ్ కేసులు 2.7 లక్షలు దాటగా, వారిలో 1,35,205 మంది రోగులు కోలుకున్నారు. 1,33,632 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ విధంగా చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్య పెరిగినట్లయింది. మొత్తం కరోనా కేసుల్లో కోలుకున్న రోగుల సంఖ్య 48.99 శాతంగా నిలిచింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 9,985 మందికి కరోనా సోకింది.
దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులు మొత్తం 2,76,583కు చేరాయి. గత 24 గంటల్లో 279 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,745కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,289 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 1313, ఢిల్లీలో 905 మరణాలు చోటు చేసుకున్నాయి.
అధిక కేసుల నమోదుతో భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయేమోనని ఆందోళనకు గురవుతున్న ప్రజలకు తాజాగా కోలుకుంటున్న రోగుల గణాంకాలు భవితవ్యంపై ఆశలు రేకెత్తిస్తున్నాయన్నారు. ఈ గణాంకాల ప్రకారం 80 శాతం కేసుల్లో స్వల్ప అస్వస్థత నమోదవుతున్నది.
వీరందరూ 100 శాతం కోలుకునే అవకాశమున్నదని భావిస్తున్నారు. 20 శాతం మంది మాత్రమే ఆరోగ్య సమస్యలతో దవాఖానల్లో చేరుతున్నారు. దవాఖానాల్లో చేరిన వారిలో కేవలం ఐదు శాతం మంది రోగులకే ఐసీయూ వార్డుల్లో చికిత్స అవసరం ఉంటున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు చెప్పారు.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూస్‌క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్