లూలూ మాల్ భూకేటాయింపు రద్దు చేయాలి

లూలూ మాల్ భూకేటాయింపు రద్దు చేయాలి
లూలూ మాల్ కు కేటాయించిన భూమిని రద్దు చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కు స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం), ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. నగరంలో లూలూ గ్రూప్ కు కేటాయించిన ప్రభుత్వ భూమిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ ప్రతినిధి బృందంలో ప్రాంత సహా సంయోజక రాజేష్, ప్రాంత సంపర్క్ ప్రముఖ్ ప్రసాద్ రెడ్డి, విశాఖ జిల్లా సంయోజక రాజీవ్, విశాఖ జిల్లా మహిళా ప్రముఖ్ శ్రీమతి కె పద్మజ, విశాఖ జిల్లా సహా మహిళా ప్రముఖ్ శ్రీమతి శ్రీ లత తదితరులు పాల్గొన్నారు.
విలువైన ప్రజల సొమ్ముతో ఉన్న భూమిని ఒక విదేశీ బిజినెస్ సంస్థకు కేటాయించడం వల్ల స్థానిక పారిశ్రామిక రంగాలకు, సంప్రదాయ వ్యాపారాలకు, ఆర్థిక స్వావలంబన (స్వదేశీ సిద్ధాంతం)కు భంగం కలుగుతుందని వారు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. లూలూ మాల్ ప్రాజెక్టుతో స్థానిక వ్యాపారులు, చిన్న విక్రయదారులు, స్వదేశీ వాణిజ్యం నష్టపోతుందని, బహుళజాతి సంస్థకు విలువైన భూమిని ఇవ్వడం ఆత్మనిర్భర్ భారత్ భావనకు విరుద్ధం అని వారు స్పష్టం చేశారు.
అభివృద్ధి అని చెప్పుకునేవి, స్థానిక మహిళా-యువ పారిశ్రామిక వేత్తలు, ఎంఎస్ఎంఈ  లను ప్రోత్సహించాలని వారు కోరారు. లూలూ మాల్ ప్రాజెక్టు సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని పునఃపరిశీలించి, భూమి కేటాయింపును రద్దు చేయాలని వారు  విజ్ఞప్తి చేశారు.

మరోవంక, విజయవాడ పాత బస్టాండ్‌ స్థలాన్ని లూలూ కంపెనీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌టిసి స్థలాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన బుధవారం పాత బస్టాండ్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిఒ నెంబర్‌ 137ను రద్దు చేయాలని, ఆర్‌టిసి స్థలాలను పరిరక్షించాలని, లూలూ కంపెనీకి ప్రభుత్వ స్థలాలను ప్రతిఘటించాలని, టిడిపి కూటమి ప్రభుత్వ భూ దాహాన్ని నిలువరించాలని, పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. 

 
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, రైతు సంఘాల సమాఖ్య సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుత లూలూ కంపెనీకి ఆర్‌టిసి స్థలాలను కట్టబెట్టడం ప్రజాభిప్రాయానికి, చట్టాలకు భిన్నంగా ఉందని విమర్శించారు. లూలూ కంపెనీకి ఆర్‌టిసి స్థలాన్ని చదరపు అడుగు రూపాయిన్నరకు టిడిపి కూటమి ప్రభుత్వం కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. 
 
లూలూకు కేరళలో రెండు, దేశ వ్యాప్తంగా 13 మాల్స్‌ ఉంటే ఎక్కడా ఆయా ప్రభుత్వాలు ఎకరం స్థలం కూడా ఇవ్వలేదని గు ర్తు చేశారు. విశాఖ బీచ్‌ రోడ్డులో 13 ఎకరాలు, విజయవాడలో 4.17 ఎకరాలు ఇవ్వడానికి సిఎం చంద్రబాబుకు చేతులెలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.