ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ త్వ‌ర‌లోనే భారత్ పర్యటన

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ త్వ‌ర‌లోనే భారత్ పర్యటన
ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ త్వ‌ర‌లోనే భారత్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు చెందిన తేదీలు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ తెలిపారు. ప్ర‌స్తుతం ధోవ‌ల్ మాస్కోలో ఉన్నారు.  అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలు విధించారు. తొలుత 25 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్​, ఆ తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. 
ఈ నేపథ్యంలో పుతిన్​ భారత్​కు వస్తున్నట్లు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భార‌త్, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా భాగ‌స్వామ్యం అంశాల‌పై ధోవ‌ల్ చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎస్-400 సిస్ట‌మ్స్ అంశంలో ర‌ష్యాతో ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఇండియా వ‌ద్ద మూడు ఎస్-400 డిఫెన్స్ సిస్ట‌మ్స్ ఉన్నాయి.  ఇటీవ‌ల పాక్‌తో జ‌రిగిన ఉద్రిక్త‌త‌ల వేళ వాటిని వాడారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లోనూ ధోవ‌ల్ ర‌ష్యాలో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న పుతిన్‌తో భేటీ అయ్యారు.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య రాబోయే రోజుల్లో సమావేశం జరగనుందని క్రెమ్లిన్ గురువారం తెలిపింది. ఇరు దేశాలు దీనిని ఏర్పాటు చేయడంపై పనిచేస్తున్నాయని పేర్కొంది. సమావేశానికి వేదికపై ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఆ వివరాలను తర్వాత ప్రకటిస్తామని పుతిన్ విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ల తెలిపారు.
భేటీకి సంబంధించిన వేదిక అంశంలో రెండు దేశాలు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్ ఇటీవ‌ల మాస్కోలో ప‌ర్య‌టించారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఇద్ద‌రు అగ్ర‌నేత‌ల‌కు చెందిన భేటీపై అంగీకారం కుదిరిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ భేటీకి జెలెన్‌స్కీని కూడా ఆహ్వానించాల‌ని అమెరికా నిర్ణ‌యించింది. కానీ దీనిపై ర‌ష్యా స్పందించ‌లేదు.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పుతిన్​తో సమావేశం జరగడం ఇదే తొలిసారి అవుతుంది. అదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్ల నుంచి జరుగుతోంది. దాన్ని ఆపుతానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నో పావులు కూడా కదిపారు. కానీ పుతిన్ పట్టించుకోవడం లేదు. ఆ కోపాన్ని రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన భారత్​పై సుంకాల పేరుతో చూపిస్తున్నారు!

కాగా, ఈనెల చివ‌ర‌లో ప్ర‌ధాని మోదీ  చైనాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ ప‌ర్య‌ట‌న‌కు చెందిన నిర్ణ‌యం తీసుకున్నారు. చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారు. అమెరికా అద‌న‌పు సుంకాలు విధించిన నేప‌థ్యంలో భారత్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.