భారత్ పై ట్రంప్ మరో 25 శాతం సుంకాలు

భారత్ పై ట్రంప్ మరో 25 శాతం సుంకాలు
* అన్యాయం, అసమంజసం… భారత్ తీవ్ర నిరసన
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మిత్ర దేశం అని చెప్పుకుంటూనే భారత్ పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేపడుతుండడంతోపై ట్రంప్‌ 2 5శాతం అదనంగా సుంకాలు అమలు చేసేందుకు బుధవారం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకాలు చేశారు. అదనపు సుంకాలు 21 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది.  ట్రంప్ తొలి సుంకాలు అమలులోకి రావడానికి 14గంటల ముందు అదనంగా సుంకాలు విధించేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
జులై 30న ట్రంప్‌ భారత్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పన్నుల ఆగస్టు 7 నుంచి అమలులోకి రానుండగా, అదనపు సుంతకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి.  ఈ చర్యను “చాలా దురదృష్టకరం” అని పేర్కొంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక బలమైన, స్పష్టమైన ప్రతిస్పందనను జారీ చేసింది. అనేక ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలకు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే అమెరికా నిర్ణయం “అన్యాయం, అసమంజసం
అంటూ ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

 
భారతదేశం తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, తన పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై ఇటువంటి ఏకపక్ష చర్యల వల్ల ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
రష్యా నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తుందని, తద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు సహాయపడుతుందని ట్రంప్‌ ఆరోపించారు. 
అమెరికా అధ్యక్షుడు సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ప్రకారం రష్యాపై ఉక్రెయిన్‌ దాడి కారణంగా మార్చి 8, 2022న కొన్ని దిగుమతులు, పెట్టుబడులను నిషేధించారు. 
ఏప్రిల్‌ 15, 2021న అమెరికా సైతం ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకాలు చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం రష్యా నుంచి ముడి చమురు, పెట్రోలియం, పెట్రోలియం ఇంధనం, సంబంధిత ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని అమెరికాలో నిషేధించారు. రెండో ఉత్తర్వు ప్రకారం భారతదేశంపై సుంకాలు విధించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు.
 
ఇటీవలి రోజుల్లో రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా పనిచేస్తోందని జైస్వాల్ విచారం వ్యక్తం చేశారు.  “మా దిగుమతులు మార్కెట్ కారకాలపై ఆధారపడి ఉన్నాయని, భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించే మొత్తం లక్ష్యంతో చేశామని సహా ఈ అంశాలపై మా వైఖరిని మేము ఇప్పటికే స్పష్టం చేసాము” అని జైస్వాల్ పేర్కొన్నారు.
 
సోమవారం కూడా అంతకుముందు, రష్యా ముడి చమురు సేకరణ కోసం న్యూఢిల్లీని “అన్యాయమైన, అసమంజసమైన” లక్ష్యంగా చేసుకున్నందుకు అమెరికా, ఐరోపా యూనియన్‌లపై భారతదేశం పదునైన ఎదురుదాడిని ప్రారంభించింది.  అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులో భారత ప్రభుత్వం ప్రస్తుతం రష్యన్ ఫెడరేషన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. వర్తించే చట్టాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ భూభాగంలో భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై 25 శాతం అదనపు సుంకం విధించబడుతుంది. 
 
ఈ ఉత్తర్వులోని సెక్షన్ 3 ప్రకారం.. వినియోగం కోసం యూఎస్‌లోకి ప్రవేశించే, వినియోగం కోసం గోడౌన్‌ నుంచి తొలగించబడిన వస్తువులపై ఈ సుంకం వర్తిస్తుంది. అయితే, ఈ మినహాయింపు ఓడరేవు నుంచి నౌకలో లోడ్ చేయబడిన, తుది రవాణా మోడ్‌లో 21 రోజుల్లోపు యూఎస్‌లోకి ప్రవేశించిన వస్తువులకు వర్తిస్తుంది. ఇతర దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నాయో లేదో తెలుసుకునే పనిని అధ్యక్షుడు ట్రంప్ తన వాణిజ్య మంత్రికి అప్పగించారు. ఈ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.