రాష్ట్రపతిపై కొండా సురేఖ వివాదాస్పద వాఖ్యలు

రాష్ట్రపతిపై కొండా సురేఖ వివాదాస్పద వాఖ్యలు
తరచూ వివాదాస్పద వాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వంకు గుదిబండగా మారిన మంత్రి కొండా సురేఖ తాజాగా నేరుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి చేసిన వాఖ్యలో కాంగ్రెస్ పార్టీనే తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.  ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ ధర్నాలో కొండా సురేఖ మాట్లాడుతూ, “ద్రౌపది ముర్ము వితంతు మహిళ కావడంతోనే పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ పిలవలేదు. ఆమె దళిత మహిళ అయినందువల్ల రామమందిర ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానం ఇవ్వలేదు” అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల పట్ల బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“బీజేపీ నేతలకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయింది” అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. మతం, కులం ఆధారంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతి వంటి గౌరవ పదవిపై జరిగిన వ్యాఖ్యలపై సమాజంలో అన్ని వర్గాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ‌తంలో కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబం, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. నాంపల్లి కోర్టు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. 
 
ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని, కూల్చి వేయకుండా ఉండడం కోసం తన వద్దకు సమంతను పంపించాలని కేటీఆర్ అడిగితే అక్కినేని నాగ చైతన్య, నాగార్జున వెళ్ళమని చెప్పారని, అందుకు సమంత నిరాకరించడంతో విడాకులు ఇచ్చి పంపించేశారని ఆమె ఆరోపించారు. పైగా, కేటీఆర్ కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.  వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
 “కేటీఆర్ కు తల్లి, అక్క, చెల్లి లేరా. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి ఆయనే కారణం”అని తీవ్రంగా విమ‌ర్శించారు. ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లో, రాజ‌కీయంగా తీవ్ర క‌ల‌క‌లం రేపాయి.