అమెరికా సుంకాల బెదిరింపుల నుండి బ్రిక్స్ దేశాలకు రష్యా మద్దతు!

అమెరికా సుంకాల బెదిరింపుల నుండి బ్రిక్స్ దేశాలకు రష్యా మద్దతు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు గ్లోబల్ సౌత్ దేశాల సార్వభౌమత్వంపై దాడి చేయడమే అని రష్యా స్పష్టం చేసింది. వారికి మద్దతుగా బ్రిక్స్ దేశాలు నిలబడతాయని హెచ్చరించింది. ‘గ్లోబల్‌ సౌత్‌’ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా ఆధునిక వలసవాద విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొంటూ సుంకాల బెదిరింపులపై రష్యా మండిపడింది. 
 
సుంకాలు, ఆంక్షలు చరిత్ర సహజ గమనాన్ని మార్చలేవని హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికపై స్వతంత్ర మార్గాన్ని ఎంచుకునే దేశాలపై అమెరికా రాజకీయ ప్రేరేపితమైన ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోందని విమర్శించింది.  అభివృద్ధి చెందుతున్న, ఆర్థికంగా వెనుకబడిన (గ్లోబల్ సౌత్) దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, నిజమైన బహుళపక్ష వాదం, సమానత్వంతో కూడిన ప్రపంచ వ్యవస్థ సాకారానికి కృషి చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డజన్ల కొద్దీ దేశాలపై సుంకాలను విధించిన కొన్ని రోజుల తర్వాత మాస్కో నుంచి ఈ హెచ్చరికలు చేసింది. “ఆయా దేశాలపై ఆంక్షలు విధించడం దురదృష్టకరం. అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా అంగీకరించలేకపోతోంది. ఈ నేపథ్యంలో తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆధునిక వలసవాదాన్ని అనుసరిస్తోంది” అంటూ మండిపడింది. 

“తనను అనుసరించేందుకు నిరాకరిస్తున్న, స్వతంత్ర మార్గాన్ని ఎంచుకునే దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు చేస్తోంది. గ్లోబల్ సౌత్‌ దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష ఆక్రమణ, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తోంది” అని రష్యా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించారు. ఏ సుంకాల యుద్ధాలు, ఆంక్షలు చరిత్ర సహజ గమనాన్ని ఆపలేవని తాము దృఢంగా విశ్వసిస్తున్నామని మరియా స్పష్టం చేశారు.

తమకు పెద్ద సంఖ్యలో భాగస్వాములు, సారూప్యత కలిగిన మిత్రదేశాలు, గ్లోబల్ సౌత్ దేశాలు, అన్నింటికంటే ముఖ్యంగా బ్రిక్స్‌ దేశాలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.  చట్టవిరుద్ధమైన ఏకపక్ష ఆంక్షలను ప్రతిఘటించడానికి మాస్కో సిద్ధంగా ఉందని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలు ఒకప్పుడు ప్రోత్సహించిన స్వేచ్ఛా వాణిజ్య రంగంలో ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రేరేపిత రక్షణావాదం, సుంకాల అవరోధాలు ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు.

కాగా, భారత్‌పై అమెరికా చేస్తున్న బెదిరింపులు అసమర్థమైనవని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. “ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో మాతో వాణిజ్య సంబంధాలను రద్ద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం ఇతర దేశాలను బెదిరించడం మేం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి బెదిరింపులను చట్టబద్ధమైనవిగా పరిగణించం. ఎందుకంటే సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కును కలిగి ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకు విరుద్ధంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరైన చర్య కాదు” అని పెస్కోవ్ హెచ్చరించారు.

మరోవంక, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్‌ మంగళవారం హెచ్చరించారు. “భారత్‌ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఎందుకంటే వారు (భారత్‌) మాతో వ్యాపారం చేస్తున్నారే కాని మేము వారితో వ్యాపారం చేయడం లేదు. అందుకే 25 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించాం. అయితే రానున్న 24 గంటల్లోగా దీన్ని గణనీయంగా పెంచదలచుకున్నాను. ఎందుకంటే వారు రష్యన్‌ చమురు కొంటున్నారు. యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారు” అని మంగళవారం సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు.