15,000 డాలర్లు కడితేనే అమెరికా వీసాలు!

15,000 డాలర్లు కడితేనే అమెరికా వీసాలు!

వలసదారులపై కఠిన ఆంక్షలు అమలుచేస్తోన్న అమెరికా తాజాగా బిజినెస్‌, టూరిస్ట్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు పూచీకత్తు కింద 15వేల డాలర్ల వరకు బాండ్‌ చెల్లించాలని అగ్రరాజ్య విదేశాంగశాఖ ప్రతిపాదించింది. 12 నెలల పైలట్ ప్రోగ్రామ్‌ కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బి-1 (బిజినెస్), బి-2 (టూరిస్ట్) వీసాలపై ఈ నిబంధన తీసుకురానున్నట్లు తెలిపింది. 

ఫెడరల్‌ రిజిస్ట్రీలో అధికారి నోటీసు పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీని ప్రకారం బిజినెస్‌, టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5 వేలు, 10 వేలు, లేదా 15 వేల సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాలి.

ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని, గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా, వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్నా ఎలాంటి రీఫండ్‌ చేయరు.  అయితే, ఈ బాండ్‌ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదని వివరించింది. 

షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్‌, పర్యాటక ప్రయాణాల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్‌ ప్రోగ్రామ్‌లో ఉన్న దేశాలకు ఈ బాండ్‌ వర్తించబోదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 42 దేశాలు ఉండగా, అందులో మెజార్టీ ఐరోపా దేశాలు కాగా ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. 

కాగా, వీసా గడువు తీరినా కొంతమంది దేశం విడిచి వెళ్లట్లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం అంటుంది. గతంలో ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్‌ ప్రాజెక్టును తీసుకొచ్చారు.  ఇలాఉండగా, అమెరికా వీసా హోల్డర్లకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికాలోని భారత పౌరులు అక్కడి వీసా నిబంధనలు గౌరవించాలని సూచించింది. వీసాలో పేర్కొన్న అధికారిక గడువు తర్వాత దేశంలో ఉండటం నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్ వేదికగా హెచ్చరించింది. 

ఒకవైపు ఇరు దేశాల మధ్య టారిఫ్ ల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్లోని అమెరికా ఎంబసీ ఈ రకంగా హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థులు, ఉద్యోగులుగా వెళ్లిన వారు తమ మంజూరైన గడువును గౌరవించకపోతే, అమెరికాలో శాశ్వతంగా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంబసీ హెచ్చరించింది. అమెరికాలో వీసా దుర్వినియోగాన్ని అరికట్టే ప్రణాళికలో భాగంగా ఈ ప్రకటన చేసినట్లు యూఎస్ చెబుతోంది.