బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ నయవంచన

బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ నయవంచన
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే బిసిలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లను రెండేళ్లు గడిచినా ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలహీన వర్గాల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించకుండా చేతకానితనంతో కేంద్ర ప్రభుత్వంపై బట్టకాల్చి వేసే ప్రయత్నం చే యడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి, బిసిల హక్కులు కాపాడాలని కోరుతూ బిజెపి ఒబిసి మోర్చా ఆద్వర్యంలో శనివారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చెబుతున్న 42శాతం రిజర్వేషన్లు బిసిలకు మే లు చేసేవి కావని, మతపరంగా, ఓట్లపరంగా రాజకీయాల కోసం ముస్లింలకు మేలు చేస్తాయని ఆరోపించారు. 

స్థానిక సంస్థలలో 34శాతం కోటా బిసిలకు ఇచ్చిన రాష్ట్రం ఇదని, వీటిని బిఆర్‌ఎస్ పాలకులు 23 శాతానికి కుదించారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో 12 శాతం మతపరమైన రిజర్వేషన్లు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసే నాటి సిఎం కెసిఆర్ శాసనసభలోనే ముస్లిం కోటాను ప్రకటించారని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో 33 శాతం డివిజన్లను గతంలో బిసిలకు కేటాయించే పరిస్థితి ఉండేదనీ, కానీ కెసిఆర్ ఆ రిజర్వేషన్లను తగ్గించారని ఆ రోపించారు. అసలు బిసిల రిజర్వేషన్లు తగ్గాయా, లేక పెరిగాయా అనేది సిఎం రేవంత్ చెప్పాలని సవాల్ చేశారు. ప్రస్తు తం ప్రభుత్వం చెబుతున్న 42 శాతం కోటాలో 10 శా తం ముస్లింలను తీసివేస్తే, బిసిలకు మిగిలేది 32 శాతమే కదా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. 

మీరు 42 శాతం రిజర్వేషన్ అని ఆడంబరంగా చెబుతున్నారు సరే, కానీ గతంలో బిసిలకు ఉన్న రిజర్వేషన్ల కంటే మీరు 2 శాతం తక్కువే ఇస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ చేసిన చట్టం బిసిలకు మేలు చేసేది కాకుండా నష్టం చేసేదని ధ్వజమెత్తారు.

 రాష్ట్రంలోని అన్ని వర్గాల జనాభా పెరిగిందని సర్వేలో చూపెట్టిన కాంగ్రెస్, బిసిల జ నాభా మాత్రం తగ్గించి చూపించారన్న కిషన్ రెడ్డి అసలు సర్వే సైతం సరిగ్గా జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42కు 42 శాతం రిజర్వేషన్లు బిసిలకే ఇవ్వాలని, ఇందులో నుంచి ముస్లింకు ఇస్తామంటే తాము ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.