
హైకోర్టు మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ చివాట్లు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని తెలిపారు. 243డి(6) క్లాజ్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని స్పష్టం చేస్తూ అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తోందని బిజెపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
42% బీసీ డిక్లరేషన్ అనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డిక్లరేషన్ను విడుదల చేశారు. ఇప్పుడు ఆ బిల్లును అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అందులో కేవలం 32 శాతం మాత్రమే ఇవ్వాలనుకొంటున్నారని రామచందర్ రావు ఆరోపించారు. మిగతా 10 శాతం మాత్రం ఎంఐఎం చెప్పినట్టు, ఓవైసీ సోదరుల ఒత్తిడితో ముస్లింలకు కేటాయించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ పేరిట తేవడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.
బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లలోని ముస్లింలకు కేటాయించిన 10% రిజర్వేషన్లను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1947 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, తెలంగాణలో గానీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయని పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా, అందుకో కేవలం ఒక్కరే బీసీ కావడం కాంగ్రెస్ వైఖరిని చూపిస్తోందని విమరసంచారు. కాంగ్రెస్ కేబినెట్లో కేవలం ముగ్గురు బీసీ మంత్రులే ఉన్నారని చెప్పారు.
ఇప్పుడు బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని బిజెపి నేత పిలుపిచ్చారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న బిజెపికి బీసీ సమాజం అండగా ఉందన్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీలను భారతీయ జనతా పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్ర చేస్తోందని రామచందర్ రావు ఆరోపించారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!