4,5,6 తేదీల్లో మాజీ డిజి ఎబివి ప్రాజెక్టుల బాట

4,5,6 తేదీల్లో మాజీ డిజి ఎబివి ప్రాజెక్టుల బాట
ఏపీ  నెలకొన్న సాగు-తాగునీటి ప్రాజెక్టుల వాస్తవ స్థితిగతులు తెలుసుకుని వాటిని ప్రజలకు వివరించే లక్ష్యంతో ఆగస్టు 4,5,6 తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలనకు ఆలోచనపరుల వేదిక ఆధ్వర్యంలో మాజీ డిజి ఎబి వెంకటేశ్వరరావు రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, నీటి పారుదల రంగం విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ లతో కలిసి పర్యటనలు చేపట్టారు.

గత యాభై అరవై సంవత్సరాలుగా కృష్ణా నదీ జలాల పంపకం, వాడకం, రాయలసీమలో సాగునీటి పారుదల అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకాల అంశంపై ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి, కేవలం రాజకీయాల కోసం వాడుకోవడం జరుగుతున్నదన్న విషయాన్ని అందరం గమనిస్తున్నామని చెబుతూ  ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు.

కృష్ణా నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని సముద్రం పాలవుతున్నాయి, ఎన్ని నీళ్ళు వాడుకునే సామర్థ్యం రెండు రాష్ట్రాలకు ఉన్నది, ఏ మేరకు ఆ సామర్థ్యాన్ని వినియోగించుకోగలుగుతున్నామో ఆలోచించాలని ఆయన చెప్పారు. 30 ఏళ్ళ క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి? ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా “డెడ్ ఇన్వెస్ట్మెంట్”గా ఉండి, దాన్నుంచి ఒక్క రూపాయి ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎ టుపోయినట్టు? ఎవరు తిన్నట్టు? ఏ కాంట్రాక్టర్ల లబ్ది కోసం ఈ ప్రాజెక్టులు కట్టినట్టు?

ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్నాయి? వాటికి అయ్యే ఖర్చేంత? ఇప్పటివరకు పెట్టిన ఖర్చుతో పోల్చితే, ఇంకా పెట్టాల్సిన ఖర్చు శాతమెంత?  ఆ కాస్తా ఖర్చు పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన పదుల వేల కోట్ల రూపాయల “డెడ్ ఇన్వెస్ట్మెంట్”పై కడుతున్న వడ్డీలు ఎంత నష్టం చేస్తాయి? అనే విషయాల మీద ప్రజలకు స్పష్టత కల్పించడం కోసం ప్రాజెక్టుల సందర్శనకు నిర్ణయించుకున్నామని వివరించారు. ఆగస్టు 4న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన జలాశయం నల్లమల సాగర్ , రెండు సొరంగాల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని ప్రతినిధిబృందం తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది.

5వ తేదీన శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మించిన, నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని తరలించే మల్యాల,  ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను బృందం సందర్శిస్తుంది. అటుపై, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయరును సందర్శిస్తుంది.  6వ తేదీన శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్సార్బీసీ) ప్రధాన రిజర్వాయరు అయిన గోరకల్లు, దాని తర్వాత అలగనూరు రిజర్వాయరు,సుంకేసుల ఆనకట్టలను సందర్శించిన మీదట కర్నూలులో రైతు సంఘాల నేతలు, పౌర సమాజం ప్రతినిధులతో ప్రతినిధిబృందం సమావేశం  అవుతుంది.