
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం పన్ను విధించాలనే ఆకస్మిక నిర్ణయం వల్ల ఏర్పడిన ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారతదేశం కూడా ప్రయత్నిస్తున్న సమయంలో ఎఫ్-35 యుద్ధ విమానాలను అమెరికా నుండి కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను భారత్ తిరస్కరించినట్లు తెలుస్తున్నది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్‌హౌస్ పర్యటన సందర్భంగా అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు ప్రతిపాదనను డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు.
అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి ఎఫ్-35 ఒప్పందాన్ని ఒక మూలస్తంభంగా ఉమ్మడి మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే, భారతదేశం ఖరీదైన, ఆఫ్-ది-షెల్ఫ్ కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ ఆసక్తి వ్యక్తం చేయకపోవడంతో ఇప్పటి వరకు అమెరికా నుండి నిర్దిష్ట ప్రతిపాదన కూడా రాలేదు. అందుకు బదులుగా ఉమ్మడి డిజైన్ ప్రయత్నాలు, దేశీయ తయారీ సామర్థ్యాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని ఆ నివేదిక జోడించింది.
ఐదో తరం ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలు కోసం అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరుపలేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు స్పష్టంచేసింది. కాంగ్రెస్ ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖడే అడిగిన ప్రశ్నకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలలో అనిశ్చితి పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం వచ్చింది.
ఆగస్టు 7 నుండి అమలు కానున్న ట్రంప్ ఆకస్మిక సుంకాల ప్రకటన భారత అధికారులను ఆశ్చర్యపరిచింది. భారత ప్రభుత్వం తక్షణ ప్రతీకార చర్యను తోసిపుచ్చినప్పటికీ, అమెరికాతో తన వాణిజ్య మిగులును తగ్గించుకునే చర్యలను చురుకుగా పరిశీలిస్తోంది. అయితే, ఎఫ్ -35 ల వంటి ప్రధాన సైనిక కొనుగోళ్లను ఎటువంటి చర్చలకైనా భారత అధికారులు తిరస్కరించారు.
ప్రపంచంలోని అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన ఈ విమానం, చాలా కాలంగా భారతదేశానికి వాషింగ్టన్ వ్యూహాత్మక ప్రతిపాదనలతో భాగంగా ఉంది ఆసియాలో చైనా విస్తరిస్తున్న సైనిక సంపదను ఎదుర్కోవడానికి సహాయపడే సాధనంగా పరిగణినిస్తున్నారు. ఎఫ్-35 ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా, భారతదేశం అమెరికాతో లోతైన రక్షణ సంబంధాల విషయంలో ఉద్దేశపూర్వక విరామం సూచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది.
స్వదేశీ పరిజ్ఞానం, దేశీయ తయారీపై దృష్టి పెట్టడమే అమెరికా డీల్‌పై భారత్ ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. దేశీయంగా రక్షణ పరికరాలను సంయుక్తంగా తయారు చేయడం, రూపొందించడంపై దృష్టి సారించే ఒప్పందాలపైనే భారత్ ఎక్కువ ఆసక్తి చూపుతుందని రక్షణశాఖ అధికారులు వెల్లడించినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం, స్థానికంగా తయారీ, స్వదేశీ సామర్థ్య అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని వారు చెప్పినట్లు వెల్లడించింది.
ఇంతలో, రష్యా భారతదేశ రక్షణ ప్రాధాన్యతలకు దగ్గరగా సరిపోయే ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చింది. జూలైలో, మాస్కో సు-57ఇ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్, సు-35ఎం మల్టీరోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సహా ప్యాకేజీని అందించింది. వీటిని రోస్టెక్, విమాన తయారీదారు సుఖోయ్ సమర్పించారు. రష్యన్ ప్రతిపాదనలో సు-57ఇ కోసం పూర్తి సాంకేతిక బదిలీ ఉందని, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ ప్లాంట్‌లోనే అసెంబ్లీని ప్లాన్ చేయనున్నట్లు చెబుతున్నారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము