అమెరికా సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం

అమెరికా సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలపై భారత్ స్పందిస్తూ ట్రంప్‌ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టత ఇచ్చింది. అయితే ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను గమనించామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది.

కాగా, ట్రంప్ ద్వారా అమెరికా శుక్రవారం నుంచి విధిస్తున్న పాతిక శాతం సుంకాల ప్రభావం భారత్‌కు చెందిన పలు రంగాల ఉత్పత్తులపై వెంటనే పడుతుంది. ప్రత్యేకించి భారతదేశపు అత్యధిక ఎగుమతుల రంగ సంబంధిత ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, స్టీల్, స్మా ర్ట్‌ఫోన్లు, అల్యూమినియం, సోలార్ పరికరాలు, మెరైన్ ఉత్పత్తులు, వజ్రాలు, నగలు నిర్ణీత ప్యాకెట్ ఫుడ్స్, వ్యవసాయ ఉత్పత్తులపై పడుతుంది.

ఇవన్నీ కూడా ఈ పాతిక శాతం జాబితాలో చేరుతాయి. భారత్ అమెరికా మధ్య ఇప్పుడు 87 బిలియన్ డాలర్ల ఎగుమతి లావాదేవీలు సాగుతున్నాయి. అమెరికానే భారత్‌కు అత్యధిక స్థాయి ఎగుమతి దేశం అయింది. ఇక వివిధ రకాల మందుల ఉత్పత్తి ఫార్మా కంపెనీలపై కూడా పాతిక శాతం భారం పడుతుంది.  ట్రంప్ నిర్ణయంతో తక్షణరీతిలో సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్ రాహుల్ అహ్లూవాలియా చెప్పారు.
25 శాతం సుంకాలతో తమపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్ కంపెనీ వర్గాలు విశ్లేషించాయి. మరోవంక, వాణిజ్య ఒప్పందం కోసం గతకొద్ది నెలలుగా భారత్‌-అమెరికా మధ్య నడుస్తున్న సంప్రదింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా మెచ్చేలాగే ఈ చర్చలు ఫలప్రదమవుతాయన్న ఆశాభావాన్ని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యక్తం చేశారు. 

కాగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ సైతం భారత ప్రయోజనాలు దెబ్బతినకుండానే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామన్న విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. త్వరలోనే ట్రేడ్‌ డీల్‌ జరుగుతుందన్న ధీమాను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ కూడా వెలిబుచ్చుతున్నారు. అయితే తాను విధించిన ప్రతీకార సుంకాలకు చివరి గడువు ఆగస్టు 1 అని, దీన్ని ఇక పొడిగించేది లేదని ట్రంప్‌ స్పష్టం చేయడంతో మొత్తం ఈ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠనే నెలకొంది.