పహల్గాం ఉగ్రదాడిలో టిఆర్ఎఫ్ పాత్ర నిర్ధారించిన ఐరాస

పహల్గాం ఉగ్రదాడిలో టిఆర్ఎఫ్ పాత్ర నిర్ధారించిన ఐరాస

జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో హిందూ పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నివేదిక స్పష్టం చేసింది. ఇది భారతదేశానికి గొప్ప దౌత్య విజయమని చెప్పవచ్చు. ఐరాస భద్రతా మండలికి (ఐఎస్ఐఎస్, ఆల్ఖైదా) ఆంక్షల కమిటీ- మానటరింగ్ టీమ్ (ఎంటీ) విడుదల చేసిన నివేదిక  “2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో లక్షరే తోయిబాకు చెందిన ప్రాక్సీ సంస్థ టీఆర్ఎఫ్ ప్రమేయం ఉంది. ఈ దాడిలో 26 మంది మరణించారు” అని స్పష్టం చేసింది.

2019 తర్వాత ఒక నివేదికలో పాక్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ గురించి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. “యూఎన్ఎస్సీ నివేదికలోని దక్షిణాసియా విభాగం కింది మొదటి భాగం చాలా పెద్దది. అందులో టీఆర్ఎఫ్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించారు” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “ఇందులోనే లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్లకు ఉన్న సంబంధాలు గురించి, ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఇస్తున్న మద్దతు గురించి ప్రస్తావించారు. భారతదేశం ఇప్పటి వరకు ఏం చెబుతోందో, అదే యూఎన్ఎస్సీ నివేదిక కూడా చెప్పింది” అని గుర్తు చేసాయి.

“ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పర్యాటక ప్రదేశం పహల్గాంలోకి ఐదుగురు ఉగ్రవాదులు చొరబడ్డారు. వీరు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘టీఆర్ఎఫ్’ ఈ దాడి చేసింది తామేనని ప్రకటించింది. అంతేకాదు దాడి జరిగిన ప్రదేశానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ప్రచురించింది. మరుసటి రోజు ఆ దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ పునరుద్ఘాటించింది. అయితే అనూహ్యంగా ఏప్రిల్ 26న టీఆర్ఎఫ్ తన వాదనలను ఉపసంహరించుకుంది” అంటూ ఆ నివేదిక తెలిపింది. 

“ఆ తరువాత ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మరో ఇతర ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. అయితే లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ మధ్య సంబంధాలను తోసిపుచ్చలేము. కనుక జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత ఉపఖండంలో ప్రాంతీయ సంబంధాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలను ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. లష్కరే తోయిబా మద్దతు లేకుండా టీఆర్ఎఫ్ ఆ దాడి చేయలేదు” అని ఆ నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదికను 1267 ఆంక్షల కమిటీ, మానిటరింగ్ బృందం సహా, భద్రతా మండలి సభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గతంలో పాక్ జాతీయ అసెంబ్లీలో, పహల్గాం దాడిని ఖండిస్తూ యూఎన్ఎస్సీ చేసిన పత్రికా ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరును తొలగించాలని తాను బలవంతం చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో “ఎంటీ నివేదికలో టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించడం వల్ల పాకిస్థాన్ చెప్పే అబద్ధాలను, మోసపూరిత కథనాలను ప్రపంచం ఎలా చూస్తుందో తెలుస్తుంది” అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

“లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రసంస్థలు తమ నుంచి దృష్టి మళ్లించడానికి జమ్మూకశ్మీర్లో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్), ‘పీపుల్ ఎగెనెస్ట్ ఫాసిస్ట్ ఫ్రంట్’ లాంటి లౌకిక పేర్లతో ప్రాక్సీ ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేశాయి. వీటికి పాకిస్థాన్ అండదండలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ఉగ్రవ్యూహాన్ని పంక్చర్ అయ్యింది” అని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

వాస్తవానికి 2023 నుంచి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ గురించి యూఎన్ మానిటరింగ్ కమిటీకి వివరాలు అందిస్తోంది. 2024లో కనీసం రెండు సందర్భాల్లో ఎంఈఏ- లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ కార్యకలాపాలపై, ఎల్టీఈతో టీఆర్ఎఫ్ సంబంధాల గురించి మానిటరింగ్ కమిటీకి తెలియజేసింది.

జులై నెలలో యూఎన్ సంస్థకు పాకిస్థాన్ అధ్యక్షత వహించింది. ఆ సమయంలో మానిటరింగ్ కమిటీ నివేదిక నుంచి టీఆర్ఎఫ్ పేరును తొలగించేందుకు పాక్ చాలా ప్రయత్నించింది. అయితే కానీ యూఎన్ఎస్సీ నివేదికలో టీఆర్ఎఫ్ పేరును చేర్చారు. మొత్తానికి దీని వల్ల ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్ తిరుగులేని ప్రమేయాన్ని ఇది సూచిస్తుంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో భారత్ విశ్వసనీయతను ఇది ధృవీకరిస్తోంది.

జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, 2019లో టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ స్థాపించారు. పాక్ ఐఎస్ఐ మద్దతు కూడా దీనికి ఉంది. ఈ ఉగ్రసంస్థ భారత పౌరులు, మైనారిటీలు, పర్యాటకులు, భద్రతా దళాలను లక్ష్యంగా పనిచేస్తోంది.