
ఒకవేళ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపాలనుకుంటే, ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత్, పాకిస్థాన్ దేశాలు ఒకేసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయని, కానీ పాకిస్థాన్‌ను ఉగ్రవాద కేంద్రంగా భావిస్తున్నారని,భారత్ ను మాత్రం ప్రజాస్వామ్యానికి తల్లిగా భావిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.
ప్రతిపక్షాల “విధానపరమైన దివాలా” దేశానికి సమస్యగా మారిందని ఆరోపిస్తూ, పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ప్రభుత్వ ప్రతిస్పందనతో విభేదిస్తే ప్రతిపక్ష పార్టీలు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాలని రాజ్‌నాథ్ సూచించారు. “ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ బాధ్యతలను కలిగి ఉంటాయి.. ఎవరైనా అది సరైన చర్య కాదని భావిస్తే, ప్రత్యామ్నాయం ఏమిటో ప్రజలకు చెప్పాలి” అని సింగ్ తెలిపారు.
పాకిస్థాన్ చేపడుతున్న అణ్వాయుధ బెదిరింపులకు భారత్ తలవంచదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఎటువంటి యుద్ధ వ్యూహాలనైనా తిప్పికొడుతుందన్నారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమన్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేషన్ సింధూర్ సంకేతంగా నిలుస్తుందని, కానీ గత ప్రభుత్వాలు దశాబ్ధాల క్రితమే ఇలాంటి చర్యలను చేయాల్సి ఉండే అని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిదన్న విషయాన్ని విపక్షాలు ఎందుకు అడగడం లేదని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. కానీ భారతీయ యుద్ధ విమానాల గురించి మాత్రమే ప్రశ్న వేస్తోందని విమర్శించారు. ఏదో ఒక రోజు పీవోకే ప్రజలు భారత్ తో కలుస్తారని, భారతీయులమని చెప్పుకునేందుకు వాళ్లు గర్వపడుతారని రాజ్‌నాథ్ చెప్పారు.
ఆపరేషన్ సిందూర్‌కు కేవలం కామా మాత్రమే పెట్టామని, ఫుల్ స్టాప్ పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కేవలం పాకిస్థాన్‌ను శిక్షించడమే అని, కానీ ఆ దేశంపై యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని తేల్చి చెప్పారు.
పాకిస్థాన్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిందని, ఆ దాడిలో ఒక్క పాకిస్థానీ పౌరుడు కూడా మరణించలేదని మంత్రి రాజ్‌నాథ్ గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. దాయాది దేశం మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సిందూర్‌ను మళ్లీ ప్రారంభించేందుకు వెనుకాడమని హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని పేర్కొంటూ దేశ భద్రత విషయంలో విపక్షాలు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. దేశ భద్రత విషయంలో మన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. 1962, 71 యుద్ధాల్లో విపక్షంలో ఉన్నప్పుడు తాము నిర్మాణాత్మక పాత్ర పోషించామని చెప్పారు.
సైన్యానికి జరిగిన ఆస్తినష్టంపై తాము ఆనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని గుర్తుచేశారు. “భారత్ వద్ద ఐఎన్‌ఎఫ్ విక్రాంత్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2014 కంటే 35 రెట్లు పెరిగాయి. 2014లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.686 కోట్లుగా ఉండగా 2024 నాటికి రూ.24 వేల కోట్లకు పైగా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు చేరుకున్నాము” అని తెలిపారు.
వంద దేశాలకు పైగా రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయని చెబుతూ 2029 నాటికి రూ.50 వేల కోట్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో 10 అగ్ర దేశాల సరసన నిలిచామని పేర్కొంటూ భారత్ ఆత్మనిర్భర్ లక్ష్యం సాధిస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు మద్దతిచ్చే దేశాలకు సందేశం ఇచ్చామని, పాక్ సైనికులు యుద్ధ మైదానంలో భారత్‌పై గెలవలేరని నిరూపించమని తెలిపారు.
“మే 10న భారత వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన పలు వాయు స్థావరాలపై దాడులు చేసింది. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. దాడులను ఆపాలని పాక్ డీజీఎంవో ఛానల్ ద్వారా వేడుకుంది. దాయాది దేశం విజ్ఞప్తి చేయడంతోనే దాడులను ఆపి ఆపరేషన్ సిందూర్‌ను తాత్కాలికంగా నిలిపివేశాం” అని రాజ్నాథ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదానికి సంబంధించి పలు కీలక విషయాలు గురించి రాజ్నాథ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాలని భారత్ కోరుకుంటోందని స్పష్టం చేశారు. సరిహద్దుకు ఆవతలి వైపు పోరాడగల సత్తా భారతసైనికులకు ఉందని ఆపరేషన్ సిందూర్‌ర్ తో నిరూపించామని ఆయన చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు తీవ్రవాదులను భారత దళాలు అంతమొందిచాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భారత దళాలను అభినందించారు. పహల్గాంలో ఉగ్రదాడిపై మోదీ గట్టి సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎక్కడికైనా వెళుతుందని స్పష్టమైన సందేశం ఇవ్వడమే భారత్ ప్రతిస్పందన, ఆపరేషన్ సిందూర్ లక్ష్యం అని ఆయన నొక్కి చెప్పారు.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం
వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన