
ఇక ఈ సందర్భంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారేనని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. “చిదంబరం జీ నిన్న ఓ ప్రశ్న లేవనెత్తారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని రుజువు ఏమిటని? అని అడుగుతున్నారు. ఆయన ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? పాకిస్థాన్‌ను సమర్థించడం ద్వారా ఆయనకు ఏం వస్తుంది?” అని ప్రశ్నించారు.
ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులే అని స్పష్టం చేస్తూ వారి దగ్గర పాక్‌లో తయారైన చాక్లెట్లు దొరికాయని చెప్పారు. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్ వివరాలూ ఉన్నాయని తెలిపారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల హత్య వార్త విన్నప్పుడు విపక్ష నేతలు సంతోషంగా ఉంటారని తాను అనుకున్నానని తెలిపారు. కానీ ఈ వార్త పట్ల వారు సంతోషంగా లేరని తనకు అనిపిస్తుందని విస్మయం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్ లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ఆ పరిస్థితికి దారితీసిన ఘటనలను ఆయన సభలో వివరిస్తూ పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారని, దాంట్లో 25 మంది భారతీయులు, ఓ నేపాలీ ఉన్నారని చెప్పారు. ఏప్రిల్ 30వ తేదీన సీసీఎస్ మీటింగ్‌లో సింధూ నదీ జలాలపై నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
పాకిస్థానీ పౌరుల్ని వెనక్కి పంపామని, సీఆర్పీఎఫ్, ఆర్మీ, జేకే పోలీసులు ఉగ్రవాదులకు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మే 9వ తేదీన పాకిస్థాన్‌పై దాడి కోసం ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి షా చెప్పారు. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామని, నూర్ ఖాన్ ఛక్లా, మురిద్, సుగుర్దా, రఫికీ, రహిమ్ ఖాన్, జాకోబాబాద్, భోలారిని ధ్వంసం చేసినట్లు చెప్పారు.
ఆరు రేడార్లను, సర్ఫేస్ టు ఎయిర్ ఆయుధాలను ధ్వంసం చేశామని, ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేయలేదని, కానీ భారత్‌లో ఉన్న పౌర ప్రాంతాలను పాకిస్థాన్ దాడి చేసే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ తన దాడులకు చెందిన అన్ని రకాల సామర్థ్యాలను కోల్పోవడంతో, ఆ దశలో ఆ దేశానికి మరో అవకాశం లేకుండా పోయిందని, అప్పుడు పాకిస్థాన్ లొంగిపోయినట్లు అమిత్ షా తెలిపారు.
మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేశారని, అయితే అడ్వాంటేజ్ ఉన్న సమయంలో ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రతి యుద్ధానికి ఓ సామాజిక కోణం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. 1951, 1971లో జరిగిన యుద్ధాల గురించి ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను నెహ్రూ అప్పగించారని, షిమ్లా ఒప్పందంలో దాన్ని డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు.
More Stories
న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ 15 బిలియన్ డాలర్ల దావా
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత