కాల్పుల విరమణకై మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్ అబద్ధం

కాల్పుల విరమణకై మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్ అబద్ధం
భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం ఎంతమాత్రం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చలో జైశంకర్పాల్గొంటూ కాల్పుల విరమణకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని తేల్చి చెప్పారు. 
 
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను కొట్టివేశారు. ఏప్రిల్ 22- జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు. భారత్-పాక్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ అనంతరమే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
 
అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాల్ చేసి మోదీతో మాట్లాడారుని, పాకిస్థాన్ భారీ దాడికి పాల్పడనుందని ఆయన చెప్పగా ఒకవేళ అదే జరిగితే మేము అంతకంటే భారీ దాడులతో బదులిస్తామని మోదీ స్పష్టం చేశారని తెలిపారు. మే 9, 10వ తేదీన పాక్ సైన్యం క్షిపణిదాడులను భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టిందని జైశంకర్ తెలిపారు.

పాకిస్థాన్‌ కాల్పులపై భారత్ విరుచుకుపడటంతో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ పాక్ నుంచి భారత ప్రభుత్వానికి ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే ప్రొటోకాల్ ప్రకారం ఇలాంటి సమాచారం అధికారికంగా పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి రావాలని భారత్ పట్టుపట్టిందని జైశంకర్ సభకు తెలిపారు. భారత్‌-పాక్‌ మధ్య ఎలాంటి మధ్యవర్తిత్వం జరగలేదన్న ఆయన, అణ్వస్త్ర బ్లాక్‌ మెయిలింగ్‌కు భారత్‌ ఎప్పుడూ తలొగ్గదని వెల్లడించారు.  

ఉగ్రదాడికి గురైన దేశానికి తిప్పికొట్టే హక్కూ ఉంటుందని పేర్కొంటూ భారత్‌ కూడా అదే పని చేసిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌చెప్పారు. పాకిస్థాన్, ఉగ్రవాదులకు గట్టి సందేశం ఇవ్వాలనే ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్ర మౌలిక స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన లోక్‌సభలో పేర్కొన్నారు.

 కాగా, లష్కరే తొయిబా ప్రాక్సీ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడం వెనుక భారత దౌత్యానికి క్రెడిట్ దక్కుతుందని జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదానికి చిరకాలంగా పాకిస్థాన్ మద్దతిస్తున్న విషయాన్ని భారత్ బలంగా ప్రపంచ దేశాల ముందుకు తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. ప్రపంచానికి పాకిస్థాన్ నిజస్వరూపం వెల్లడించడంలో విజయవంతం అయ్యామని చెప్పారు. 

 
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని తెలిపారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరు కేవలం ఆపరేషన్ సిందూర్‌కు పరిమితం కాదని, దేశ ప్రజలు, వారి ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. జాతీయ భద్రతపై భారత్ దృఢ వైఖరి కొనసాగిస్తోందని, పాకిస్థాన్ జాతీయులకు వీసా ఆంక్షలు కొనసాగుతాయని వివరించారు. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న విస్తృత వ్యూహంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే జైశంకర్‌ ప్రసంగ సమయంలో విపక్ష సభ్యుల నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన అమిత్‌షా విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశ విదేశాంగ మంత్రిపై విపక్ష సభ్యులకు నమ్మకం లేదని మండిపడ్డారు. వారికి వేరే దేశాలపై ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది అని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రవర్తన వల్లే వారు విపక్షంలో ఉన్నారని, మరో 20 ఏళ్లు కూడా ఉంటారని అమిత్‌షా స్పష్టం చేశారు.