
జమ్ముకశ్మీర్‌లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కనీసం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టారు. ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు చినార్ కోర్ వెల్లడించింది. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని ప్రచారం జరుగుతోంది. కానీ చినార్ కోర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే, హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రదారి సులేమాన్ షా అలియాస్ మూసా ఫౌజీ ఉన్నట్లు బలగాలు గుర్తించాయి. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అయిన సులేమాన్ షా పహల్గామ్ ఉగ్రదాడికి కుట్రపన్నడమే కాకుండా ఆ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడని భద్రతాబలగాలకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గత ఏడాది శ్రీనగర్-సోన్మార్గ్ హైవేలోని జడ్-మోర్హ్ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఉన్న ఏడుగురిని హత్య చేసిన ఘటనలో కూడా సులేమాన్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు.
చివరకు సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా, భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపగా ముగ్గురు హతమయ్యారు. మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తయిబాకు చెందిన వారని సమాచారం. ఉగ్రవాదుల నుంచి భద్రతాబలగాలు 17 గ్రనేడ్లు, ఒక M4 కార్బైన్, రెండు AK-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.
ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కార్డన్, సెర్చ్ చేపట్టారు సైనికులు. ఘటనాస్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టామని, మరణించిన ఉగ్రవాదులు ఆ దాడికి పాల్పడిన వారిగానే తెలుస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై సైన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా, గతేడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్ముకశ్మీర్‌లోని పహాల్గమ్ లో గల ప్రముఖ పర్యటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. పర్యటకులపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తిను పొట్టనపెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రతాదళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు తామే దాడికి పాల్పడినట్లు ప్రకటించారు. ఆ తర్వాత తమ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు.
More Stories
ఆపరేషన్ సింధూర్ తో ముక్కలైన మసూద్ కుటుంబం
న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ 15 బిలియన్ డాలర్ల దావా
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్