7 నెలల్లో మావోయిస్టులు లొంగిపోవాలి

7 నెలల్లో మావోయిస్టులు లొంగిపోవాలి

వచ్చే ఏడు నెలల్లో మావోయిస్టులు అజ్ఞాతం వదిలి జనజీవనంలోకి రావాలని ఏపీ డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీని వినియోగించుకుని తమ జీవిత గమ్యాన్ని మార్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి తర్వాత మావోయిస్టులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన తరుణంలో డీజీపీ స్పందించారు. 

మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పని చేస్తున్నారని చెప్పారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీసులు తమ కూంబింగ్‌ ఆపరేషన్‌ను మరింత విస్తృతం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత వారంలో ఆపరేషన్‌ బృందాలు పెద్ద ఎత్తున మావోయిస్టు డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. వీటిని విజయవాడ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం వద్ద భద్రతా బృందాలు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పరిశీలన కోసం ప్రదర్శనగా ఉంచారు. అందులో అత్యాధునిక ఆయుధాలు, ఇతర సామగ్రితోపాటు కేజీల కొద్దీ పేలుడు కోసం వినియోగించే వైర్లు ఉన్నట్లు గుర్తించారు.

ఇటీవల ఐదుసార్లు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్‌, డివిజనల్‌ కమిటీ కార్యదర్శి రమేష్‌ ఉన్నారని చెప్పారు. వీరి నుంచి ఎనిమిది ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

డివిజనల్‌ కమిటీ కార్యదర్శి, ఏరియా కమిటీ సభ్యులు, యాక్షన్‌ టీం సభ్యులు ఇలా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ఇద్దరు డివిజినల్‌ కమిటీ కార్యదర్శులు, 15 మంది ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 40 మంది లొంగిపోయారని చెప్పారు. అజ్ఞాతంలోని నక్సలైట్లు స్వచ్ఛందంగా లొంగిపోవాలని వారికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డుతోపాటు ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని హామీ ఇచ్చారు.

ఇటీవల పోలీసు అధికారుల వద్ద లొంగిపోయిన 13 మందికి సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను డీజీపీ అందేశారు. గత ఏడాది కాలంలో మొత్తం 64 లక్షల రూపాయల నజరాను వివిధ హోదాల్లో లొంగిపోయిన 48 మందికి అందజేసినట్లు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా తెలిపారు. మావోయిస్టులు అంతా లొంగిపోవాలని వారికి పునరావాసం కల్పిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.