
* స్వేచ్ఛా వాణిజ్యంపై కూడా చర్చలు
మాల్దీవులు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు భారత్ ఎల్లప్పుడు సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోదీ భారత్ మహాసాగర్ విజన్‌లో మాల్దీవులుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ద్వీపదేశానికి రూ.4,850 కోట్లు రుణంగా ఇస్తామని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చునేందుకు కూడా చర్చలను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చామని ప్రధాని తెలిపారు.
బ్రిటన్ పర్యటన ముగించుకొని మాల్దీవులుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మాలె విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్-ముయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి, మోదీకి స్వాగతం పలికారు. రిపబ్లిక్ స్వ్కేర్ వద్ద ఆ దేశ సైనికుల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. ఈ క్రమంలో మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం మాల్దీవులు అధ్యక్షుడి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశాధినేతతో విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.తొలుత ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపి వాటిని మరింత బలపర్చుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యం, డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతులు, మత్స్యరంగం, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించారు.
వాణిజ్యం, రక్షణ రంగాల్లో పరస్పరం సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరత, ప్రగతి కోసం కృషి చేయాలని భారత్, మాల్దీవులు ఒక నిర్ణయానికి వచ్చాయని విదేశాంగశాఖ తెలిపింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.
స్చేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు. భారత్ అనుసరించే ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం ఉంది అని అన్నారు. “ఈ ఏడాది భారత్, మాల్దీవులు మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లుపూర్తి అవుతున్నాయి. మాల్దీవులుకు భారత్ అత్యంత సన్నిహిత పొరుగుదేశం. భారత నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, మహాసాగర్ విధానాల్లో మాల్దీవులుకు ముఖ్యమైన స్థానం ఉంది” అని ప్రధాని ప్రకటించారు.
“ఇరుదేశాల అభివృద్ధి భాగస్వామ్యానికి కొత్త రెక్కలు తొడిగేందుకు మాల్దీవులుకు 565 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఇవ్వాలని నిర్ణయించాం. ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. మా భాగస్వామ్య పెట్టుబడిని వేగవంతం చేయడానికి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మేము త్వరలో కృషి చేస్తాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా ప్రారంభమయ్యాయి” అని మోదీ తెలిపారు.
శనివారం మాల్దీవులు స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారత్ సహకారంతో నిర్మించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీపై లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విభేదాల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి