ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుంది

ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుంది

ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొంటూ దేశ సైనిక సంసిద్ధత విషయంలో మన సన్నద్ధత స్థాయి చాలా ఎక్కువగా ఉండాలని తెలిపారు. మనం 24 గంటలు.. 365 రోజులు సిద్ధంగా ఉండేలా సన్నాహాలు ఉండాలని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రక్షణ సదస్సులో సీడీఎస్‌ జనరల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ యుద్ధ పరిస్థితుల్లో భవిష్యత్‌లో ఒక సైనికుడు సమాచారం, సాంకేతికతతో పాటు యోధుడిలాంటి పోరాట నైపుణ్యాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు. 

సైన్యం ‘శాస్త్ర’ (యుద్ధం), శాస్త్ర’ (నాలెడ్జ్‌) రెండింటినీ నేర్చుకోవడం అవసరమని చెబుతూ మారుతున్న ఆధునిక యుద్ధ వ్యూహాలపై సైతం ఆయన స్పందించారు. యుద్ధంలో రన్నరప్‌లు ఉండరని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూనే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని అనిల్ చౌహాన్ సూచించారు. అందుకు ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ అని చెప్పారు.

ఆయుధాలు, టెక్నాలజీ పరిజ్ఞానం గురించి మిలటరీ పూర్తిగా అప్‌డేట్ కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. “సాంకేతిక పరిజ్ఞాన నిరంతర కృషి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నాము. సైనిక వ్యవహారాలలో మూడవ విప్లవం అని నేను పిలిచే దాని శిఖరాగ్రంలో మనం ఇప్పుడు నిలబడి ఉన్నాము, ఈ పదాన్ని నేను కన్వర్జెన్స్ రకమైన యుద్ధం అని పిలిచాను” అని చెప్పారు.

నేటి యుద్ధాలు సంప్రదాయ సరిహద్దులకే పరిమితం కాదని, సాంకేతికంగా చాలా సంక్లిష్టంగా మారాయని పేర్కొంటూ దీన్ని మూడో సైనిక విప్లవంగా అభివర్ణించారు. నేటి యుద్ధం ఇకపై తుపాకులు, ట్యాంకులకే పరిమితం కాదని చెబుతూ మూడు స్థాయిల యుద్ధాల్లో ప్రావీణ్యం అవసరం పేర్కొన్నారు. భూమి, నీరు, గాలితో పాటు సైబర్‌ వంటి కొత్త యుద్ధ భూమిలో సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. 

డ్రోన్‌, సైబర్‌, నరేటివ్‌ వార్‌, కంజెక్టివ్‌ వార్‌ ఫేర్‌, అంతరిక్షంతో అనుసంధానమైన యుగంగా పేర్కొన్నారు. ‘కన్వర్జెన్స్ వార్‌ఫేర్’పై స్పందిస్తూ.. కన్వర్జెన్స్ వార్‌ఫేర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ.. నేడు కైనటిక్‌, నాన్-కైనటిక్ (సాంప్రదాయ-డిజిటల్) యుద్ధాలు ఒకదానితో ఒకటి విలీనం అవుతున్నాయని చెప్పారు. మొదటి, రెండవతరం యుద్ధాలు.. నేడు మూడో తరం సైబర్‌, ఏఐ ఆధారిత యుద్ధాలతో విలీనమయ్యాయని చౌహన్ తెలిపారు.

‘హైబ్రిడ్ వారియర్’ భావన భవిష్యత్తులో మనకు సరిహద్దులో పోరాడగల, ఎడారిలో వ్యూహాన్ని రూపొందించగల, నగరాల్లో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలను నిర్వహించగల, డ్రోన్‌లను అడ్డుకునేలా, సైబర్ దాడులకు ప్రతిస్పందించగల ‘హైబ్రిడ్ వారియర్’ అవసరమని సీడీఎస్‌ చెప్పారు. ఇప్పుడు మనకు మూడు రకాల యోధులు అవసరమని జనరల్ చౌహాన్ తెలిపారు. టెక్ వారియర్స్, ఇన్ఫో వారియర్స్, స్కాలర్ వారియర్స్ అవసరమని తెలిపారు. రాబోయే యుద్ధాల్లో ఈ మూడు రకాల పాత్రల్లో పని చేసే నైపుణ్యం ఉండడం తప్పనిసరని, ఇది ఆధునిక యుద్ధానికి కొత్త నిర్వచనంగా పేర్కొన్నారు.