
ఇంధన భద్రత విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి విమర్శించారు. దీనివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా దేశాలు ప్రస్తుతం భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తమకు తెలుసని, ఇక ఇదే సమయంలో ఇతర దేశాలూ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని ఈయూ గుర్తించాలని ఆయన సూచించారు.
ఇతర దేశాల ఉనికితో ముడిపడిన అంశాలపై చర్చించే క్రమంలో సమతూకంగా, స్పష్టమైన విధానంతో ముందుకు సాగాలని హితవు చెప్పారు. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడంతో పశ్చిమ దేశాలు ఒత్తిడి పెంచుతున్న భారతదేశ ఇంధన అవసరాలే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఏమేం చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తామని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు ఇంధన భద్రతను కల్పించి తీరుతామని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 23 నుంచి 26 వరకు బ్రిటన్లో పర్యటించనున్న నేపథ్యంలో విక్రమ్ మిస్రి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. భారత్, తుర్కియే (టర్కీ), యూఏఈ లాంటి దేశాలు రష్యా ముడి చమురును శుద్ధి చేసి ఐరోపా దేశాలకు పెట్రోలు, డీజిల్, విమాన ఇంధనాలను సరఫరా చేస్తుంటాయి. ఇటీవలే రష్యాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన ఆంక్షల ప్రభావం ఈ దేశాల్లోని రిఫైనరీల కార్యకలాపాలపైనా పడనుంది.
రష్యా ప్రభుత్వానికి చెందిన రోస్‌నెఫ్ట్ కంపెనీకి గుజరాత్‌లోని నయారా ఎనర్జీలో 49.13 శాతం వాటా ఉంది. ఇంకా రష్యా నుంచి దేశాలు కొనే ముడి చమురు రేటును ఈయూ తగ్గించింది. ముడి చమురు ఎగుమతి వ్యాపారం నుంచి లభించే ఆదాయపు దన్నుతో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. రష్యా ఆదాయానికి గండికొట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆ దేశం నుంచి ముడి చమురును కొనే భారత్ లాంటి దేశాలపై ఈయూ ఒత్తిడిని పెంచుతుంది.
2024లో ఈయూ దేశాలకు భారత్ 19.2 బిలియన్ డాలర్లు విలువైన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 2025లో 15 బిలియన్ డాలర్ల ఎగుమతులే చేసింది. అంటే దాదాపు 27.1 శాతం ఎగుమతులు తగ్గాయి. ఈయూ ఆంక్షల ప్రభావంతో రష్యా నుంచి భారత్‌కు చమురు ఎగుమతులు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి భారత్ 50.3 బిలియన్ డాలర్లు విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంది.
రష్యా మొత్తం ముడి చమురు ఎగుమతి వ్యాపారం (143.1 బిలియన్ డాలర్లు)లో భారత్ బిల్లు మూడింట ఒకవంతుకు సమానం. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని కొనసాగిస్తే భారీ జరిమానాలు తప్పవని భారత్, చైనా, బ్రెజిల్, అన్ని బ్రిక్స్ కూటమి దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరించకుంటే, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొంటున్న దేశాలపై 100 శాతం సెకండరీ సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.
భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాల చేయూత వల్లే ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోందని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలను నలిపివేయబోతున్నామని హెచ్చరించారు. రష్యా యుద్ధం కోసం ఈ దేశాలే నిధులు అందిస్తున్నాయని ఆరోపించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు